ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో తవ్వకాలలో శివలింగం బయటపడటంతో గ్రామస్థుల్లో ఆనందం వెల్లివిరిసింది. శివలింగ దర్శనం కోసం సమీప ప్రాంతాల నుంచి ప్రజలు రావడం ప్రారంభించారు. శివ లింగ బయటపడ్డ కొద్దిసేపటికే భక్తులు గుమిగూడారు. సమాచారం అందిన వెంటనే పోలీసు బృందం కూడా అక్కడికి చేరుకుంది. మహాశివరాత్రికి ముందు శివలింగం దొరకడం శుభసూచకమని గ్రామస్థులు చెబుతున్నారు.
ఈ ఘటన హాపూర్‌లోని బాబుగఢ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బాబుగఢ్‌లోని రసూల్‌పూర్ గ్రామంలో నివసిస్తున్న రాజేంద్ర సింగ్, గురువారం ఉదయం మల విసర్జనకు బయటకు వెళ్లాడు. అప్పుడు అతను ఓ పాముల గుంపును చూశాడు. వెంటనే గ్రామస్థులకు ఈ విషయం తెలిపాడు. విషయం తెలుసుకున్న జనాలు తవ్వకాలు ప్రారంభించారు. దాదాపు ఒక అడుగు పొడవున్న శివలింగం కనిపించింది. గ్రామంలో తవ్వకాలలో శివలింగం దొరికిందనే వార్త దావానలంలా వ్యాపించింది. సమీప ప్రాంతాల నుంచి భక్తులు శివలింగాన్ని పూజించడానికి తరలివచ్చారు. క్షీరాభిషేకం చేయడం ప్రారంభించారు.
పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్న స్టేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ గుప్తా ఈ ఘటనపై స్పందించారు. “ఓ పొలంలో తవ్వకాలు జరిపారు. ఇక్క శివలింగం బయటపడింది. పెద్ద సంఖ్యలో ప్రజలు పూజ కోసం రావడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.” అని తెలిపారు.