Supreme Court: పౌరసత్వానికి ఆధార్ కార్డు ఖచ్చితమైన రుజువు కాదు: సుప్రీంకోర్టు

ఈసీ వాదనకు సుప్రీంకోర్టు సమర్థన;

Update: 2025-08-13 01:45 GMT

ఆధార్‌ను స్పష్టమైన పౌరసత్వ రుజువుగా పరిగణించలేమంటూ భారత ఎన్నికల కమిషన్‌(ఈసీఐ) తీసుకున్న వైఖరి సరైనదేనంటూ సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది. ఓటరు పౌరసత్వాన్ని విడిగా తనిఖీ చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీహార్‌లో ఓటరు జాబితాకు సంబంధించి చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌)ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పౌరసత్వానికి చెందిన నిర్దిష్టమైన రుజువుగా ఆధార్‌ని ఆమోదించలేమని ఈసీ చెప్పడం సరైనదేనని, పౌరసత్వాన్ని విడిగా తనిఖీ చేయాల్సి ఉంటుందని జస్టిస్‌ కాంత్‌ పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌కి తెలిపారు.

అయితే పౌరసత్వ తనిఖీ ప్రక్రియను నిర్వహించే అధికారం ఈసీకి ఉందా అన్నదే ఇక్కడ మొదటి ప్రశ్నని ధర్మాసనం పేర్కొంది. వారికి ఆ అధికారం లేదంటే ఇక అంతా ముగిసినట్లేనని, అదే వారికి(ఈసీ) అధికారం ఉంటే సమస్య ఏమీ ఉండదని జస్టిస్‌ కాంత్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్‌ చేపట్టిన ప్రక్రియ భారీ స్థాయిలో ఓటర్ల తొలగింపునకు దారితీయగలదని, ముఖ్యంగా అవసరమైన పత్రాలను సమర్పించలేని వారి పేర్లు తొలగింపునకు గురవుతాయని సిబల్‌ వాదించారు. అయితే, ఆధార్ యాక్ట్, 2016లోని సెక్షన్ 9 ప్రకారం.. ఇది కేవలం ఒక గుర్తింపు ధృవీకరణ కోసం మాత్రమేనని పౌరసత్వ రుజుకు కాదని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. ఇక, పిటిషనర్ల తరఫున సీనియర్  కపిల్ సిబల్ వాదిస్తూ.. SIR ప్రక్రియలో ప్రొసీజరల్ అసమానతలుగా ఉన్నాయి.. ఇది పెద్ద సంఖ్యలో ఓటర్లను అనర్హులుగా మార్చే ఛాన్స్ ఉందన్నారు. 1950 తర్వాత భారత్ లో జన్మించిన వారందరూ దేశ పౌరులుగా గుర్తించాలని.. కానీ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో ఓటర్లను తొలగించడం చాలా అన్యాయమని కపిల్ సిబాల్ వాదించారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు సరిగ్గా వర్క్ చేయడం లేదు.. బ్రతికి ఉన్న వాళ్లను చనిపోయినట్లు జాబితా చేర్చడం వల్ల 65 లక్షల మంది ఓటర్ల పేర్లను ధృవీకరించకుండానే తొలగించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఇక, ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ అడ్వొకేట్ రాకేష్ ద్వివేది వాదిస్తూ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఎలక్టోరల్ రోల్స్‌ను రివిజన్ చేయడం ద్వారా ఆధార్, పాన్, రేషన్ కార్డులు పౌరసత్వాన్ని నిరూపించే డాక్యుమెంట్లుగా చట్టబద్ధతమైనవి కాదని పేర్కొన్నారు. ఈ డాక్యుమెంట్లు గుర్తింపు కార్డులుగా వినియోగిస్తున్నప్పటికీ పౌరసత్వాన్ని నిర్ధారించవని ఈసీఐ చెప్పుకొచ్చింది. ఈ ప్రక్రియలో ఎలాంటి పౌరుడి పౌరసత్వాన్ని రద్దు చేయడం లేదు.. కేవలం ఓటింగ్ అర్హతను మాత్రమే నిర్ధారిస్తున్నామని ఎన్నికల కమిషన్ తరపు లాయర్ పేర్కొన్నారు. అయితే, ఆధార్ కార్డు పౌరసత్వ రుజువుగా చెల్లదని తేల్చడంతో ఈసీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ, ఈ ప్రక్రియ సమయం, విధానంపై ఆందోళనలను కూడా న్యాయస్థానం వ్యక్తం చేసింది.

Similar News