Ahmedabad plane crash: అహ్మదాబాద్ ఎయిరిండియా పైలట్ మేనల్లుడికి నోటీసులు

నోటీసులపై మండిపడుతున్న పైలట్ సంఘాలు

Update: 2026-01-15 07:30 GMT

అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం వెనుక ఏం జరిగిందో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. గతేడాది జూన్ 12న ప్రమాదం జరిగితే.. ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థలు ఏం తేల్చలేకపోయాయి. అప్పటి నుంచి దర్యాప్తు చేస్తూనే ఉన్నాయి. తాజాగా పైలట్ సుమిత్‌ సభర్వాల్‌ మేనల్లుడు వరుణ్‌ ఆనంద్‌కు విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (AAIB) సమన్లు జారీ చేసింది. జనవరి 15న దర్యాప్తునకు రావాలని సమన్లు అందజేసింది. ఈ సమన్లపై పైలట్ సంఘాలు మండిపడుతున్నాయి. వేధించేందుకే ఈ సమన్లు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఏఏబీఐకి లీగల్ నోటీసులు పంపించింది.

వరుణ్‌ ఆనంద్‌ కూడా ఎయిరిండియాలో పైలట్‌గా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా భారత పైలట్ల సమాఖ్యలో సభ్యుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో వరుణ్ ఆనంద్‌కు నోటీసులు ఇవ్వడమేంటి? అని ప్రశ్నిస్తోంది. ఏఏఐబీ నోటీసులను పూర్తి అనవసరమైన చర్యగా పేర్కొంది. అహ్మదాబాద్ ప్రమాదంతో ఎలాంటి సంబంధం లేని వరుణ్ ఆనంద్‌ను పిలవడమేంటి? అని నిలదీసింది. ‘‘ఇది వేధింపులకు పాల్పడటం, మానసిక క్షోభకు గురిచేయడమే అవుతుంది. ఆయన వృత్తిపరమైన, వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది’’ అని పైలట్ల సమాఖ్య పేర్కొంది.

జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం లండన్‌కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం సమీపంలోని హాస్టల్‌పై కూలిపోయింది. ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. హాస్టల్‌లో మెడికోలు కూడా చనిపోయారు. ఇలా మొత్తం 271 మంది ప్రాణాలు కోల్పోయారు.

అయితే ప్రమాదం జరిగిన కొన్ని రోజులకు ప్రాథమిక రిపోర్టు వచ్చింది. ఈ రిపోర్ట్‌పై అంతర్జాతీయ మీడియా అనేక కథనాలు ప్రసారం చేశాయి. పైలట్ ఆత్మహత్య చేసుకోవడం వల్లే ఈ ఘటన జరిగినట్లుగా పేర్కొన్నాయి. ఈ కథనాలపై కూడా పైలట్ సంఘాలు మండిపడ్డాయి.

Tags:    

Similar News