ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి అతిశీ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆప్ శాసనసభాపక్ష నేతలు సమావేశయ్యారు. కొత్త సీఎంగా అతిశీని ఎన్నుకుంటున్నట్లు ప్రకటించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేయనున్నారు. ఈమేరకు లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనాను కలిసేందుకు ఆయన అపాయింట్‌మెంట్ కోరగా సాయంత్రం 4.30 గంటలకు సమయం కేటాయించినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, తన తర్వాత దిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై కేజ్రీవాల్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సాయంత్రానికి సీఎం ఎవరనే విషయంపై స్పష్టత రానుంది.
సెప్టెంబర్ 26, 27 తేదీల్లో దిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈమేరకు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఆ సమావేశాల్లోనే ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేసి, మధ్యంతర ఎన్నికలకు పిలుపునిచ్చే అవకాశం ఉందని సమాచారం. ఫిబ్రవరిలో జరగనున్న దిల్లీ ఎన్నికలను నవంబర్‌లో మహారాష్ట్రతో పాటు నిర్వహించాలని ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.