Rekha Gupta : ప్రభుత్వ సమీక్షలకు సీఎం రేఖా గుప్తా భర్త
రాజ్యాంగ విరుద్ధమంటూ ఆప్ తీవ్ర విమర్శలు
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీరును ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో భర్త మనీష్ గుప్తాను పక్కనే కూర్చోబెట్టుకోవడంపై విమర్శలు గుప్పించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ధ్వజమెత్తారు. ఎక్స్‌లో ఇందుకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేసి విమర్శించారు. షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రాజెక్టులపై అధికారులతో జరిగిన సమీక్షా సమావేశానికి సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు.
ఆదివారం రేఖా గుప్తా షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే ఆశ్చర్యంగా ఈ సమావేశానికి రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా కూడా హాజరయ్యారు. పైగా రేఖా గుప్తా పక్కనే కూర్చున్నారు. ఫొటోలు బయటకు రావడంతో ఆప్ తప్పుపట్టింది. ప్రభుత్వ సమీక్షల్లో భర్తను ఎలా కూర్చోబెట్టుకుంటారని ముఖ్యమంత్రిని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నించింది. ప్రముఖ వెబ్ సిరీస్ పంచాయత్‌లో రఘుబీర్ యాదవ్ పోషించిన ‘ప్రధానపతి’ పాత్రకు సమాంతరంగా వ్యవహరించారని.. అనధికారికంగా సర్పంచ్ భార్య కోసం ఉద్దేశించిన పాత్రను నీనా గుప్తా పోషించారని ఎత్తి చూపారు. ఫొటోలు ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి తీసుకున్నామని.. అలాగే సీఎంవో అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి కూడా తీసుకున్నట్లు ఆప్ నేత భరద్వాజ్ అన్నారు.
ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అంటూ భరద్వాజ్ ధ్వజమెత్తారు. ప్రపంచంలోని అతి పెద్ద పార్టీ సీఎంకు నమ్మదగిన కార్యకర్తే లేరా? ఆమె భర్తను ఎలా పక్కను కూర్చోబెట్టుకుంటారని నిలదీశారు. ఏ చట్ట ప్రకారం భర్తను ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో భాగం చేస్తున్నారని అడిగారు. కాంగ్రెస్‌ను వంశపారంపర్య రాజకీయాలంటూ నిరంతరం విమర్శించే బీజేపీ.. ఇది వంశపారంపర్య రాజకీయాలు కాదా? అని నిలదీశారు. దేశ రాజధానిలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థ బహిరంగంగా అపహాస్యం చేయబడుతుందని భరద్వాజ్ పేర్కొన్నారు. ఫొటోల్లో రేఖా గుప్తా పక్కనే భర్త మనీష్ గుప్తా కూర్చుని అధికారులతో సంభాషించారు.
రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా వ్యాపారవేత్త. షాలిమార్ బాగ్‌లో వ్యాపారాలు ఉన్నాయి. రేఖా గుప్తా ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. మనీష్ గుప్తా నికుంజ్ ఎంటర్‌ప్రైజ్ సంస్థను స్థాపించి వ్యాపారం నిర్వహిస్తున్నారు. అలాగే బీమా వ్యాపారం కూడా నిర్వహిస్తున్నారు. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. మనీష్ గుప్తా కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో సంబంధం కలిగి ఉన్నారు