Bihar: గోపాల్ ఖేమ్కా అంత్యక్రియలకు హాజరైన నిందితుడు
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు రోషన్ కుమార్‌ను గుర్తించిన అరెస్ట్ చేసిన పోలీసులు;
బీహార్‌లో వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్య రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. ఇంటి ముందే ఖేమ్కాను తుపాకీతో కాల్చి చంపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ హత్య రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇక ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ కేసులో నిందితుడు వేసిన కంత్రీ ప్లాన్ పోలీసుల ముందు బెడిసికొట్టింది. ఏమి ఎరగనట్టు అంత్యక్రియలకు హాజరై అడ్డంగా దొరికిపోయాడు.
జూలై 4న రాత్రి 11:40 గంటల ప్రాంతంలో గోపాల్ ఖేమ్కా హత్యకు గురయ్యారు. ఈ హత్యలో అనేక మంది పాల్గొన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఖేమ్కా బయలుదేరిన దగ్గర నుంచి ఆయనను ఒక గుంపు వెంటాడుతూనే ఉంది. ఏఏ ప్రాంతాలకు చేరుకున్న విషయాలు ఎప్పుటికప్పుడు ముఠా పంచుకుంది. చివరిగా వాహనం ఇంటి దగ్గరకు రాగానే షూటర్‌గా సమాచారం అందించారు. ఇంటి గేటు ముందు వాహనం ఆగగానే నిందితుడు తుపాకీ తీసుకుని కాల్చేశాడు. అనంతరం బైక్‌పై పారిపోయాడు.
ఇక ఖేమ్కా అంత్యక్రియలను కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో రాజకీయ ప్రముఖులు, ప్రజలు హాజరై నివాళులర్పించారు. నిందితుల్లో ఒకడు కూడా తనపై ఏ మాత్రం అనుమానం రాకూడదన్న ఆలోచనతో పూలదండ తీసుకొని వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అయితే అప్పటికే సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులకు.. నిందితుడ్ని గుర్తించగలిగారు. వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నిందితుడు పాట్నాకు చెందిన పున్‌పున్ ప్రాంత నివాసి రోషన్ కుమార్‌గా గుర్తించారు. హత్య కేసులో ఎప్పటికప్పుడు సహచరులతో సమాచారం పంచుకున్నట్లుగా కనుగొన్నారు. ప్రస్తుతం స్టేషన్‌లో విచారిస్తున్నారు.
ఖేమ్కా బంకిపూర్ క్లబ్ నుంచి బయలుదేరినప్పుడు అక్కడే ఉన్న వ్యక్తి నిందితులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి గాంధీ మైదాన్ ప్రాంతంలోని బిస్కోమన్ టవర్ దగ్గర ఉండి వ్యాపారవేత్త తన నివాసానికి వస్తున్నట్లు అప్రమత్తం చేశాడని చెప్పారు. ఇతర నిందితులను కూడా పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఇక ఖేమ్కా హత్య తర్వాత అధికార పార్టీపై విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మండిపడ్డాయి. కుమారుడిని చంపినప్పుడే నితీష్ కుమార్ సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటే..ఇప్పుడు ఖేమ్కా హత్యకు గురయ్యేవాడు కాదని ఎంపీ పప్పు యాదవ్ అన్నారు. మూడేళ్ల క్రితం ఖేమ్కా కుమారుడు కూడా హత్యకు గురయ్యారు. తండ్రి, కొడుకులిద్దరూ ఒకే మాదిరిగా చంపబడ్డారు.