ఓట్ల అవకతవకల గురించి ఇప్పటికే ఆధారాలు ఉన్నప్పటికీ, ఇంకా ఈసీ తనను అఫిడవిట్ దాఖలు చేయమని కోరడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విస్మయం వ్యక్తం చేశారు. ‘‘కొంత సమయం ఇస్తే ప్రతి అసెంబ్లీ, లోక్‌సభ స్థానంలో ఎన్నికల సంఘం లోపాలను ప్రజల ముందు ఉంచుతాం. అప్పుడు ప్రజలే ఈసీని అఫిడవిట్ ఇవ్వమని అడుగుతారు’’ అని రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ స్పెషల్ ప్యాకేజీల గురించి మాట్లాడినట్లే, ఈసీ కూడా ‘‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ’’ పేరుతో బీహార్ కోసం ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చిందని రాహుల్ ఆరోపించారు. ఇది ఓట్ల చోరీకి కొత్త రూపమని ఆయన విమర్శించారు. అయితే, బీహార్ ప్రజలు దీనిని జరగనివ్వరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బీహార్‌తో పాటు కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్ల చోరీకి పాల్పడిన సీఈసీతో సహా ఇతర ఎన్నికల కమిషనర్లపై చర్యలు తీసుకుంటామని రాహుల్ హెచ్చరించారు. అంతకుముందు రాహుల్ గాంధీ ఔరంగాబాద్ జిల్లాలో ఓటు హక్కు కోల్పోయిన పౌరులతో సమావేశమయ్యారు. గత నాలుగైదు ఎన్నికల్లో ఓటు వేసిన వారి ఓట్లు కూడా తొలగించబడ్డాయంటూ ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.తాము పేదల హక్కుల కోసం పోరాడుతున్నామని.. ఈ ఓట్ల చోరీని అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు.