Acteress Kasturi : కస్తూరి అరెస్ట్ కు రంగం సిద్ధం

తెలుగు జాతిపై అనుచిత వ్యాఖ్యల కేసులో బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన మద్రాస్ హైకోర్టు;

Update: 2024-11-14 06:30 GMT

తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో సీనియర్ నటి కస్తూరి శంకర్‌కు మద్రాసు హైకోర్టులో చుక్కెదరయ్యింది. ఆమె ముందస్తు బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది. కస్తూరి పిటిషన్‌పై విచారణ చేపట్టి, నిర్ణయాన్ని వాయిదా వేసిన మదురై ధర్మాసనం.. గురువారం ఉదయం తీర్పు వెలువరించింది. కస్తూరి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. వాస్తవారికి బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో కస్తూరిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగువారు తమిళనాడుకు వలస వచ్చిన వారిగా ఎలా అంటారని మండిపడింది. తెలుగువారు వలస వచ్చిన వారు కాదని, రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగస్వామిగా ఉన్న వారిని పేర్కొంది.

ఈ నెల 3న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో కస్తూరి మాట్లాడుతూ.. తమిళ రాజులకు సేవ చేసుకునేందుకు వచ్చిన వారే తెలుగువారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే, మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ద్రవిడ సిద్ధాంత వాదులను పరోక్షంగా ప్రశ్నించారు. ఇతరుల ఆస్తులను లూటీ చేయవద్దని, ఇతరుల భార్యలపై మోజుపడొద్దని, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతుండటంతోనే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని కస్తూరి ఆరోపించారు.

తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో కస్తూరి క్షమాపణలు తెలిపారు. కొంతమందిని ఉద్దేశించి మాత్రమే తానా వ్యాఖ్యలు చేశానని, తెలుగు ప్రజలను ఉద్దేశించి కాదని వివరణ ఇచ్చారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన తెలుగు సంఘాలు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నై ఎగ్మోర్‌లో ఉన్న తెలుగు సంస్థ ఫిర్యాదు మేరకు కస్తూరిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో కస్తూరికి సమన్లు ఇచ్చేందుకు వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉండడంతో ఆమెకు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉండడంతో ఆమె పరారీలో ఉన్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆమె తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిలు కోసం కస్తూరి హైకోర్టును ఆశ్రయించారు. 

Tags:    

Similar News