Aditya-L1 mission: ఇక భానుడివైపు ఆదిత్య
ఆదిత్య ఎల్ వన్ ప్రయోగానికి సర్వం సిద్ధం... అంతర్గత తనిఖీలు పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటన;
సూర్యుడిపై అధ్యయనం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో( Indian Space Research Organisation) చేపట్టనున్న ఆదిత్య ఎల్ వన్ ప్రయోగానికి(Aditya-L1 mission) సర్వం సిద్ధమైంది. ఈ అంతరిక్ష అధికారిక అబ్జర్వేటరీ మిషన్‌లోని అంతర్గత వ్యవస్థ తనిఖీలన్నీ( launch rehearsal) పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV-C57 వ్యోమనౌక ద్వారా సెప్టెంబర్ 2న ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ఆదిత్య ఎల్ వన్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
సూర్యుడి వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు.. మొత్తం ఏడు పే లోడ్(primary payload )లను మోసుకెళ్లే ఈ మిషన్‌ను దేశవ్యాప్తంగా పలు సంస్థల సహకారంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినట్లు.. ఇస్రో అధికారులు తెలిపారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అస్ర్టోఫిజిక్స్ నేతృత్వంలో విజిబుల్ ఎమిషన్ లైన్ కోరోనాగ్రాఫ్ ( Visible Emission Line Coronagraph)పేలోడ్‌ను తయారు చేశారు. పుణెకు చెందిన IUCAA సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజర్ పేలోడ్‌కు రూపునిచ్చింది.
పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక. ఆదిత్య-ఎల్ 1ను నింగిలోకి తీసుకెళ్లనుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. సూర్యుడిపై పరిశోధనలకు రోదసిలో తొలి భారతీయ అబ్జర్వేటరీగా ఈ వ్యోమనౌక పనిచేయనుంది. 1500 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని భూమి నుంచి 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రేంజ్ పాయింట్ 1 చుట్టూ ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ కక్ష్యలోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలుంటుందని ఇస్రో తెలిపింది.
ఆదిత్య-ఎల్ 1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లనుంది. సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్‌లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని పొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. ఎల్-1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా 4పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తాయని ఇస్రో తెలిపింది. మిగతా మూడు సాధనాలు....సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయని పేర్కొంది.