Piyush Pandey: అడ్వర్టైజింగ్ దిగ్గజం... ప్రకటనల సృష్టికర్త పియూష్ పాండే కన్నుమూత
కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ సంతాపం
అడ్వర్టైజింగ్ దిగ్గజం పీయూష్ పాండే మృతిచెందారు. ఆయన వయసు 70 ఏళ్లు. ఫెవికాల్, క్యాడ్‌బరీ, ఏషియన్ పేయింట్స్ లాంటి ప్రఖ్యాత బ్రాండ్‌లకు ఆయన యాడ్స్ రూపొందించారు. గత కొన్నాళ్ల నుంచి ఆయన ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. శనివారం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సుమారు నాలుగు దశాబ్ధాల నుంచి ఆయన అడ్వర్టైజింగ్ పరిశ్రమలో ఉన్నారు. ఓగ్లివీ యాడ్ కంపెనీలో చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ చైర్మెన్‌గా చేశారు.
1982లో ఓగ్లివీ కంపెనీలో పాండే చేరారు. సన్‌లైట్ డిటర్జెంట్ కోసం ఆయన తొలిసారి యాడ్ రాశారు. ఆరేళ్ల తర్వాత కంపెనీ క్రియేటివ్ శాఖలో చేరాడు. ఆ తర్వాత ఎన్నో పాపులర్ యాడ్స్‌ను ఆయన రూపొందించారు. ఫెవికాల్, క్యాడ్‌బరీ, ఏషియన్ పేయింట్స్, లూనా మోపెడ్, ఫార్చూన్ ఆయిల్‌తో పాటు అనేక బ్రాండ్లకు యాడ్స్‌ను తయారు చేశారు.
ఓగ్లివీ ఇండియా యాడ్ ఏజెన్సీ ఆయన నాయకత్వంలో వరుసగా 12 ఏళ్ల పాటు నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది. పాండే ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు. 2016లో ఆయన్ను పద్మశ్రీ వరించింది. సినిమాల్లో కూడా ఆయన నటించారు. 2013లో రిలీజైన మద్రాస్ కేఫ్‌లో నటించారు. జాతీయ సమగ్రత కోసం రూపొందించిన మిలీ సుర్ మేరా తుమారా పాటకు సాహిత్యాన్ని ఆయనే అందించారు.
భోపాల్ ఎక్స్‌ప్రెస్ అనే చిత్రానికి ఆయన స్క్రీన్‌ప్లే సహకారం అందించారు. పీయూష్ పాండే మృతిపట్ల అనేక మంది సెలబ్రిటీలు, నేతలు సంతాపం తెలిపారు. భారతీయ అడ్వర్టైజింగ్ రంగంలో ఆయన లెజెండ్ అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పీయూష్ పాండే సృజనాత్మకత అద్భుతమని ప్రధాని మోదీ అన్నారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.