FASTag : ఒక్కసారి రీఛార్జ్.. ఏడాదంతా ఫ్రీ ప్రయాణం.. ఫాస్టాగ్ సరికొత్త రికార్డు.

Update: 2026-02-07 06:00 GMT

FASTag : నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ వరంగా మారింది. గతేడాది ఆగస్టు 15న కేంద్రం ప్రవేశపెట్టిన ఈ సరికొత్త సదుపాయానికి ప్రయాణికుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కేవలం ఆరు నెలల కాలంలోనే ఏకంగా 50 లక్షల మందికి పైగా ఈ పాస్‌ను తీసుకోవడం విశేషం. టోల్ ప్లాజాల వద్ద పదే పదే రీఛార్జ్ చేసుకునే తలనొప్పి లేకపోవడం, ప్రయాణం సాఫీగా సాగిపోతుండటంతో ప్రతి నలుగురు కార్ల యజమానుల్లో ఒకరు ఇప్పుడు ఈ వార్షిక పాస్‌కే జై కొడుతున్నారు.

ఏమిటి ఈ యాన్యువల్ పాస్? ఎలా పనిచేస్తుంది?

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకువచ్చిన ఈ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,150 టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. కేవలం రూ.3,000 చెల్లించి ఒక సంవత్సరం పాటు లేదా 200 సార్లు టోల్ దాటే వరకు ఈ పాస్ పనిచేస్తుంది. కేవలం ప్రైవేట్ కార్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. మీరు రాజ్ మార్గ్ యాత్ర యాప్ లేదా NHAI వెబ్‌సైట్ ద్వారా ఈ పాస్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. పేమెంట్ చేసిన రెండు గంటల్లోనే మీ పాత ఫాస్టాగ్ పైనే ఈ సర్వీస్ యాక్టివ్ అవుతుంది. దీనివల్ల ప్రతి నెల టోల్ రేట్లు పెరిగినా లేదా మారినా మీకు ఆ టెన్షన్ ఉండదు.

చండీగఢ్ టాప్

తాజా గణాంకాల ప్రకారం.. ఈ వార్షిక పాస్ వినియోగంలో చండీగఢ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. మొత్తం లావాదేవీల్లో అక్కడ 14 శాతం వాటా ఉండగా, తమిళనాడు (12.3%), ఢిల్లీ (11.5%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ సమీపంలోని బిజ్వాసన్ టోల్ ప్లాజా వద్ద అత్యధికంగా 57 శాతం కార్లు ఈ వార్షిక పాస్ ద్వారానే వెళ్తున్నాయి. ఇది చూస్తుంటే రాబోయే రోజుల్లో సాధారణ ఫాస్టాగ్ కంటే ఈ వార్షిక పాస్‌ల హవానే ఎక్కువగా ఉంటుందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ప్రతిరోజూ ఆఫీసులకు లేదా వ్యాపారాల కోసం హైవేలపై ప్రయాణించే వారికి ఇది అత్యంత లాభదాయకమైన ఆప్షన్.

ప్రయాణికులకు కలిగే అసలు లాభాలు

వార్షిక పాస్ వల్ల కేవలం సమయం ఆదా అవ్వడమే కాదు, డబ్బు కూడా భారీగా ఆదా అవుతుంది. విడివిడిగా టోల్ కట్టడం కంటే ఈ బల్క్ పేమెంట్ వల్ల ప్రయాణికులకు దాదాపు 30 నుంచి 40 శాతం వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. టోల్ గేట్ల వద్ద స్కానింగ్ ఫెయిల్ అవ్వడం లేదా బ్యాలెన్స్ లేకపోవడం వంటి సమస్యలు ఈ పాస్ ఉంటే రావు.

Tags:    

Similar News