Odisha: బిహార్ బాటలో ఒడిశా.. కుల గణన షురూ
విస్తృతంగా సర్వే చేస్తున్న అధికారులు;
బిహార్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో నిర్వహించిన కులగణన వివరాలను వెల్లడించిన నేపధ్యంలో ఈ దిశగా నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిషా సర్కార్ సైతం పావులు కదుపుతోంది. లోక్ సభ ఎన్నికలకు ముందే నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కుల గణన చేపట్టి సర్వే వివరాలు విడుదల చేయాలని భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనకు సంబంధించి నివేదికను విడుదల చేసేందుకు కసరత్తు సాగుతోంది. ఇందులో భాగంగా తొలుత వెనకబడిన తరగతుల జనాభా గణనకు పూనుకుంది. ఇప్పటికే రంగంలోకి దిగిన అధికారులు విస్తృతంగా సర్వే చేస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో ఉన్న ఐదు ముస్లిం వర్గాల అభ్యున్నతికి చర్యలు చేపట్టడం కోసం సామాజికార్ధిక సర్వే నిర్వహిస్తామని అసోం ప్రభుత్వం వెల్లడించింది. ఆరోగ్య సంరక్షణ, సాంస్కృతిక గుర్తింపు, విద్య, ఆర్ధిక రంగాల్లో వారి అభివృద్ధికి ఈ సర్వే బాటలు వేస్తుందని అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మా ప్రభుత్వం చెప్పింది . ఆరోగ్య సంరక్షణ, సాంస్కృతిక గుర్తింపు, విద్య, ఆర్థిక అంశాలు, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత తదితర అంశాల్లో వారి అభివృద్ధికి ఈ సర్వే తోడ్పడుతుందని పేర్కొన్నారు. అదే టైంలో బిహార్ ప్రభుత్వం కుల గణన సర్వే నివేదిక విడుదల చేయడంతో దేశ వ్యాప్తంగా మళ్లీ చర్చ మొదలైంది.
ఇక బిహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వం వెల్లడించిన కులగణన నివేదిక ఆధారంగా రాష్ట్ర జనాభాలో ఓబీసీలు, ఈబీసీలు 63 శాతం ఉన్నట్టు వెల్లడైంది. రాష్ట్ర జనాభా 13.07 కోట్లు కాగా అందులో అత్యంత వెనుకబడిన వర్గాల వారు 36 శాతం, ఇతర వెనుకబడిన వర్గాల వారు 27.13 శాతం ఉన్నట్టు వెల్లడైంది. ఒడిశా లో ఈ ప్రక్రియ పూర్తయ్యాక మిగతా రాష్ట్రాలపై సైతం కుల గణన చేయాలని ఒత్తిడి పడే ఛాన్స్ ఉంది.