Bulldozer Action: హరియాణ అల్లర్ల నిందితులకు "బుల్డోజర్ ట్రీట్‌మెంట్"
హరియాణాలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత... నూహ్ జిల్లాలో వరుసగా మూడో రోజు బుల్డోజర్లకు పని;
హరియాణా( Haryana Violence)లో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. ఇటీవల రెండు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగిన నూహ్ జిల్లా(Nuh violence)లో వరుసగా మూడో రోజు అధికారులు బుల్డోజర్ల(Bulldozer Action)కు పని చెప్పారు. అల్లర్లు చెలరేగిన హరియాణాలోని నూహ్ జిల్లాలో బుల్డోజర్ల( bulldozer move)తో కూల్చివేతలు కొనసాగాయి. తావ్‌డూ పట్టణంలో అక్రమంగా ఏర్పాటు చేసుకున్న 250 గుడిసెలను తొలగించిన అధికారులు.. నల్హార్ ప్రాంతంలోనూ మెడికల్ కాలేజీ వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు. నల్హార్ వైద్య కళాశాల పరిధిలో 2.6 ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ కట్డడాలను తొలగించారు.
నూహ్‌లోని నల్హర్‌లో ఉన్న షహీద్ హసన్ ఖాన్ మేవాటీ ప్రభుత్వ వైద్య కళాశాల వద్దకు చేరుకున్న బుల్డోజర్లు భారీ పోలీసు భద్రత(police and paramilitary deployment) మధ్య దుకాణాలను కూల్చేశాయి. స్థానిక ఎమ్మెలే, సీఎల్పీ ఉప నేత అఫ్తాబ్ అహ్మద్ అడ్డుకునేందుకు యత్నించినా ఆగలేదు. వైద్య కళాశాల ప్రధాన ద్వారం ఎదురుగా కొన్నేళ్ల నుంచి ఉన్న ఈ దుకాణాల్లో అత్యధికం మెడికల్ షాపులే ఉన్నాయి. నూహ్‌లో 24 మెడికల్, ఇతర దుకాణాలను పడగొట్టింది. అరెస్టుల భయంతో ఓ వర్గానికి చెందిన చాలామంది పరారీలో ఉన్నారని అధికారులు తెలిపారు.
శనివారం ఒక్కరోజే 50 నుంచి 60 నిర్మాణాలను పడగొట్టినట్లు అధికారులు తెలిపారు. అరెస్టులకు భయపడి కొందరు దుకాణదారులు పారిపోయినట్లు చెప్పారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారికి ఇంతకుముందే నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. నూహ్‌లోనే కాక మరికొన్ని ప్రదేశాల్లోనూ అధికార యంత్రాంగం సమక్షంలో కూల్చివేతలు కొనసాగాయి. పాత తేదీలతో ఉన్న నోటీసులను చూపుతూ పేదల ఇళ్లు, దుకాణాలను పడగొడుతున్నారని.. ప్రభుత్వ వైపల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలా చేస్తున్నారని అఫ్తాబ్ ఆరోపించారు.
నూహ్‌లో అల్లర్ల వెనుక పెద్ద ప్రణాళికే ఉందని హరియాణ హోం మంత్రి అనిల్ విజ్ పునరుద్ఘాటించారు. నిర్మాణాల కూల్చివేతపై మీడియా ప్రశ్నించగా బుల్డోజర్ చికిత్సలో భాగమంటూ స్పందించారు. కాగా, కొండపై నుంచి కాల్పులకు దిగడం, భవనాలపై రాళ్లు దొరకడాన్ని బట్టి చూస్తే పక్కా పథకం ప్రకారమే దాడికి దిగినట్లు స్పష్టమవుతోందన్నారు. ఆందోళనకారులు ప్రతి ఒక్కరి చేతిలోనూ లాఠీలున్నాయని, వారికసలు ఆయుధాలు ఎక్కడివి? ఎవరో సమకూర్చి ఉంటారనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తామని హోం మంత్రి అనిల్ విజ్ తెలిపారు. అల్లర్లతో సంబంధం ఉన్న 202 మందిని అరెస్టు(202 people have been arrested) చేసి 80 మందిపై పీడీ చట్టం ప్రయోగించినట్లు చెప్పారు.