Yogi Adityanath: ఇక కృష్ణ జన్మభూమిపై బీజేపీ ఫోకస్ : యోగి ఆదిత్యనాధ్
అయోధ్య, మధుర, కాశీ ఆలయాలనే 'సనాతన్' అడుగుతోంది..;
అయోధ్యలో (Ayodhya) రామ మందిర (Ram Mandir) ప్రారంభోత్సవం తరువాత తమ తదుపరి లక్ష్యం కృష్ణుడని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో యోగి మాట్లాడుతూ కృష్ణ జన్మభూమి భూ వివాదం బీజేపీ (BJP) తదుపరి ప్రాధాన్యత జాబితాలోకి రానుందని తేల్చిచెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలు గెలుచుకునేందుకు బీజేపీ పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర అసెంబ్లీలో అయోధ్యలోని రామమందిరంతో పాటు మధుర, కాశీ ఆలయాల ప్రస్తావన చేశారు. అయోధ్యలోని రామాలయం రాష్ట్రానికి ఎలాంటి గుర్తింపు తెచ్చిందో సభలో వివరించారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh) చేస్తున్న ప్రకటనలను తిప్పికొట్టారు.
సనాతన్ (ధర్మం) కేవలం అయోధ్య, మధుర, కాశీ ఆలయాలనే డిమాండ్ చేస్తోందని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ''సనాతన ధర్మం ఆచరించే వారంతా అయోధ్యలో రామాలయం నిర్మాణంతో చాలా సంతోషంగా ఉన్నారు. ఈ శతాబ్దంలోనే ఇంతపెద్ద ఈవెంట్ జరిగితే విపక్షాలు ఒక్కమాట కూడా మాట్లాడకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఇవాళ ప్రతి ఒక్కరూ అయోధ్యలోని సరికొత్త, భవ్య రామాలయాన్ని చూసి దిగ్భ్రాంతి చెందుతున్నారు. ఈపని ఎప్పుడో జరగాల్సింది'' అని యోగి పేర్కొన్నారు. రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఎలాంటి గుర్తింపు లేకుండా చేశారని విమర్శించారు. 2017కు ముందు ఉత్తర్ ప్రదేశ్‌ను ఏలిన ప్రభుత్వాలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకువెళ్లాయి? రాష్ట్రంలోని యువకులు గుర్తింపునకు నోచుకోలేదని, ఎక్కడా ఉద్యోగాలు దొరకని పరిస్థితిని ఎదుర్కొన్నారని విమర్శించారు.