Jaishankar on AI: ప్రమాదకరంగా మారనున్న కృత్రిమమేధ

అణ్వాయుధాల మాదిరి ముప్పే అన్న విదేశాంగశాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్;

Update: 2024-10-07 02:15 GMT

వచ్చే దశాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముప్పు పొంచి ఉందని విదేశాంగశాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ హెచ్చరించారు. కౌటిల్య ఎకనామిక్‌ సదస్సులో పాల్గొన్న ఆయన ఏఐ వల్ల ఉత్పన్నమయ్యే ప్రమాదాల గురించి హెచ్చరించారు. రాబోయే దశాబ్ది కాలంలో ఇది ప్రపంచాన్ని తీవ్ర ప్రభావితం చేస్తుందన్నారు.

‘‘ప్రపంచ పర్యావరణ వ్యవస్థలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అనేది కీలకమైన అంశం. ఒకప్పటి అణ్వాయుధాల్లానే ప్రస్తుతం ఇది కూడా చాలా ప్రమాదకరం. దీన్నుంచి సంభవించే పరిణామాలను ఎదుర్కోవడానికి అన్ని దేశాలూ సిద్ధంగా ఉండాలి’’ అని జై శంకర్‌ అన్నారు. రానున్న కాలంలో ఏఐ ప్రభావం అధికంగా ఉండనుందన్నారు. ప్రపంచీకరణ గురించి మాట్లాడిన ఆయన.. రాబోయే రోజుల్లో ప్రపంచీకరణ అనేది ఆయుధంగా మారొచ్చని, దీనిపట్ల ప్రపంచ దేశాలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఐక్యరాజ్య సమితి గురించి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. ‘‘ఇది ఆర్థికపరమైన సమావేశం. అందువల్ల బిజినెస్‌ మాటల్లోనే వివరిస్తా. ఐక్యరాజ్య సమితి పాత వ్యాపారంలా మారింది. దాని పరిధి చాలా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు జరగడంలేదు. బిజినెస్‌ ప్రపంచంలో స్టార్టప్‌ల మాదిరిగా ఐరాస కూడా ముందుకు సాగాల్సి ఉంది’’ అని అభిప్రాయపడ్డారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్, పాశ్చాత్య ఎజెండాను భారత్‌పై రుద్దాలని చూస్తున్న జార్జి సోరోస్‌లతో ఎవరితో కలిసి రాత్రి విందుకు ఇష్టపడతారన్న ప్రశ్నకు..జైశంకర్‌ తెలివిగా సమాధానం ఇచ్చి అందర్ని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం శరన్నవరాత్రి ఉత్సవాల జరుగుతున్న నేపథ్యంలో తాను ఉపవాస దీక్షలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News