Congress : నేడు కాంగ్రెస్ కీలక సమావేశం
పీసీసీ ఛీఫ్‌ల ఎంపికపైప్రకటన కు అవకాశం;
నేడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరుగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ఆరంభం కానుంది. తెలంగాణతో సహా 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులు ఎవరు, ఏఐసీసీ ప్రక్షాళన, పార్టీ బలోపేతానికి ఏం చేయాలి, వచ్చే ఎన్నికల్లో అధికారం ఎలా దక్కించుకోవాలి.. ఇవే అంశాలు ప్రధాన ఎజెండాగా నేడు కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహిస్తోంది.
ఈరోజు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లు, జనరల్ సెక్రటరీలతో ఏఐసీసీ విస్తృత సమావేశం నిర్వహించనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే దిశా నిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బృహత్తర కార్యాచరణ చేపట్టనున్నారు. ఈ భేటీ అనంతరం తెలంగాణ, కర్నాటక, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ నియమించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీ ఈ కీలక సమావేశంలో ఏఐసీసీ సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాలకు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌లను నియామకం చేయనున్నారు. ఏఐసీసీ ప్రక్షాళనలో భాగంగా యువ నేతలకు జాతీయ స్థాయిలో సెక్రటరీ, జనరల్ సెక్రటరీ పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో మరికొన్ని గంటల్లో తెలియరానుంది.