Wayanad : వయనాడ్‌లో 7లక్షల ఓట్ల మెజారిటీయే లక్ష్యం: ఏఐసీసీ

Update: 2024-07-18 05:57 GMT

కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగే ఉపఎన్నికలో ప్రియాంకా గాంధీకి 7లక్షల ఓట్ల మెజారిటీ తీసుకురావాలని AICC లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై స్థానిక నేతలకు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ ప్రారంభించినట్లు సమాచారం. 2019 వయనాడ్ లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి 7,06,367 ఓట్లు వచ్చాయి. అప్పట్లో ఆయన మెజారిటీ 4,31,770 ఓట్లు. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ మెజారిటీ కాస్త తగ్గింది. ఈసారి రాహుల్ గాంధీకి 6,47,445 ఓట్లు రాగా, మెజారిటీ 3,64,422 ఓట్లకు చేరింది.

రాహుల్ గాంధీ మెజారిటీ తగ్గడంపై కాంగ్రెస్ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు గల కారణాలను తెలుసుకొని, త్వరలో జరగబోయే వయనాడ్ బైపోల్‌లో ప్రియాంకా గాంధీకి ఏకంగా 7 లక్షల ఓట్ల మెజారిటీని సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని స్థానిక నాయకత్వానికి నిర్దేశించారు. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఇప్పుడు 7 లక్షల మెజారిటీని సాధించే దిశగానే కసరత్తు చేస్తున్నాయని వయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షుడు ఓవీ అప్పచ్చన్ అంటున్నారు. ప్రత్యర్థి పార్టీల కంటే తామే ముందంజలో ఉన్నామని ఆయన చెబుతున్నారు.

Tags:    

Similar News