Flight Ticket: ఆర్మీ సిబ్బందికి ఎయిర్ ఇండియా భారీ ఆఫర్
మే 31 వరకు బుకింగ్స్‌కు, జూన్ 30 వరకు రీషెడ్యూలింగ్‌కు అవకాశం;
బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ బలగాలు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు తమ విమానాల్లో ప్రయాణించే సైనిక సిబ్బందికి ఒక ముఖ్యమైన వెసులుబాటును ప్రకటించాయి. టికెట్లను ఉచితంగా రీషెడ్యూల్ చేసుకునేందుకు లేదా రద్దు చేసుకుంటే పూర్తి డబ్బు వాపసు పొందేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపాయి.
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, రక్షణ రంగానికి చెందిన ఛార్జీలతో (డిఫెన్స్ ఫేర్స్) మే 31 వరకు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాల్లో టికెట్లు బుక్ చేసుకున్న సాయుధ బలగాల సిబ్బందికి ఈ ఆఫర్ వర్తిస్తుందని ఆ సంస్థలు వెల్లడించాయి. వారు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటే పూర్తి వాపసు అందిస్తామని, లేదా జూన్ 30 వరకు ఒకసారి ఎలాంటి అదనపు రుసుము లేకుండా టికెట్లను రీషెడ్యూల్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని ఎయిరిండియా బుధవారం 'ఎక్స్' వేదికగా ఒక ప్రకటనలో తెలిపింది. సైనిక సిబ్బంది తమ విధి నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సహాయపడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇదే విధమైన ప్రకటనను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కూడా తమ అధికారిక 'ఎక్స్' ఖాతాలో పంచుకుంది.
బుధవారం తెల్లవారుజామున భారత సాయుధ బలగాలు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన తొమ్మిది మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే క్షిపణులు, డ్రోన్లతో మెరుపు దాడులు నిర్వహించి ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలోనే విమానయాన సంస్థలు సైనిక సిబ్బంది ప్రయాణ అవసరాలకు అనుగుణంగా ఈ వెసులుబాటు కల్పించడం గమనార్హం.