Air India Express: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ 100 సర్వీసుల రద్దు
క్రూ సిబ్బంది మూకుమ్మడి సెలవులు.. 30 మందిపై సంస్థ వేటు;
టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. సిబ్బంది మూకుమ్మడి సెలవులతో (sick leave) సుమారు 100 విమానాలను ఎయిరిండియా సంస్థ రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో సెలవులు పెట్టి విమాన సేవలకు అంతరాయం కల్పించిన వారిపై సంస్థ తాజాగా చర్యలకు ఉపక్రమించింది. సుమారు 30 మంది సిబ్బందిపై సంస్థ వేటు వేసింది.
ఈ మేరకు బుధవారం రాత్రి 30 మంది సిబ్బందికి సంస్థ తొలగింపు నోటీసులు పంపినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. సర్వీస్ రూల్స్ ఉల్లంఘించిన కారణంగా తక్షణమే వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు సంస్థ నోటీసుల్లో పేర్కొంది. సరైన కారణం లేకపోయినా కావాలనే సెలవు పెట్టారని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేశారని ఉద్యోగులకు పంపిన నోటీసుల్లో సంస్థ పేర్కొంది.
సంస్థ యాజమాన్య విధానాలను నిరసిస్తూ అనారోగ్య కారణాలతో 200 మందికిపైగా క్యాబిన్ సిబ్బంది ఒకేసారి సెలవు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఏకంగా 100కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేయాల్సి వచ్చింది. షెడ్యూల్ ప్రకారం విధులకు హాజరు కావాల్సిన సిబ్బంది చివరి నిమిషంలో సిక్ లీవ్ పెట్టడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైందని తెలిపారు. ఫలితంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ ప్రభావం సుమారు 15 వేల మంది ప్రయాణికులపై పడినట్లు సదరు వర్గాలు తెలిపాయి. మరోవైపు విమానాల రద్దుపై నివేదిక సమర్పించాలని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ యాజమాన్యాన్ని పౌరవిమానయాన శాఖ కోరింది.