Delhi Air pollution: మరింత తీవ్రంగా ఎయిర్‌ పొల్యూషన్‌.

టపాసులతో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత

Update: 2023-11-13 05:00 GMT

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో రెండు రోజుల పాటు మెరుగుపడిన వాయు నాణ్యత సూచీ.. మళ్లీ దీపావళి పండుగ కారణంగా అమాంతం పెరిగిపోయింది. టపాసులపై ప్రభుత్వం నిషేధాన్ని బేఖాతరు చేస్తూ ప్రజలు పండుగను జరుపుకున్నారు. భారీగా టపాసులు, మందుగుండ పేల్చడంతో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. నగరంలోని చాలా చోట్ల ఏక్యూఐ 500పైగా నమోదుకాగా.. అక్కడక్కడ 900 వరకూ చేరడం గమనార్హం. సోమవారం ఉదయం 6 గంటలకు అత్యధికంగా లజ్‌పత్ నగర్ వద్ద 959 ఏక్యూఐ నమోదుకాగా.. తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వద్ద 910, కరోల్ బాగ్ వద్ద 779 నమోదయ్యింది.

 నగరంలో వాహనాల రద్దీ పెరగడం, పంజాబ్‌లో పంట వ్యర్థాల కాల్చివేత కారణంగా ఢిల్లీలో గత కొన్ని రోజులుగా ఎయిర్‌ పొల్యూషన్‌ పెరుగుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో దీపావళి పండుగనాడు పటాకులు కాలిస్తే కాలుష్యం మరింత తీవ్రమవుతుందనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. పండుగరోజు ఢిల్లీ నగరంలో పటాకులు కాల్చడంపై నిషేధం విధించింది. అయితే, సుప్రీంకోర్టు నిషేధాజ్ఞలను ఢిల్లీ వాసులు భేఖాతర్‌ చేశారు. దీపావళి రోజు రాత్రి యథేచ్ఛగా పోటీపడి పటాకులు కాల్చారు. దాంతో ఇవాళ ఉదయం ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎయిర్ పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నగరంలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (AQI) సగటు 286కు చేరింది. ఢిల్లీ యూనివర్సిటీ, ఐఐటీ ఢిల్లీ, ఎయిర్‌పోర్టు ప్రాంతాల్లో ఏక్యూఐ 300 దాటింది. ఇతర ప్రాంతాల్లో కొంత తక్కువగా ఉన్నది.


ఆదివారం రాత్రి పటాకులు కాల్చడంతో సోమవారం ఉదయం ఢిల్లీలోని పలు ప్రాంతాలపై దట్టమైన విషపూరిత పొగమంచు కమ్మింది. పండుగరోజైన ఆదివారం ఉదయం 202గా ఉన్న ఢిల్లీ యావరేజ్‌ ఏక్యూఐ, ఇవాళ ఉదయం 286కు పెరిగింది. రహదారులపై కమ్ముకున్న దుమ్ముధూళి కారణంగా విజుబిలీటీ బాగా తగ్గిపోయింది. 50 మీటర్ల దూరం కూడా కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

దీపావళి రోజున కాల్చే టపాసులపై దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు గతవారం నిషేధం విధించింది. తమ ఉత్తర్వులు కేవలం ఢిల్లీకే పరిమితం కాదని, దేశం మొత్తానికి వర్తిస్తాయని స్పష్టం చేసింది. అంతేకాదు, గత సెప్టెంబరులో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం టపాసులను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోడానికి కూడా నిరాకరించింది. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మానేసి, కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించింది.

Tags:    

Similar News