Ajit Pawar: మహిళా అధికారుల పట్ల తనకు పూర్తి గౌరవం ఉంది.. అజిత్ పవార్
ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్.. ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ మధ్య వాగ్వాదం
ముంబై- మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ మధ్య వాగ్వాదం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ విషయంపై ఆయన స్పందించారు. చట్టపరమైన విషయాల్లో జోక్యం చేసుకోనని ఆయన స్పష్టం చేశారు. కేవలం అక్కడి పరిస్థితిని చక్కదిద్దేందుకే తాను ఐపీఎస్ అధికారిణికి ఫోన్ చేసినట్లుగా తెలిపారు..
ఎన్సీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన ఐపీఎస్ అధికారిణి అంజలి కృష్ణకు ఫోన్ చేసిన అజిత్ పవార్ ఆమెను బెదిరించారు. ‘చూడు.. నేను ఉప ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నా.. వెంటనే నీవు చేస్తున్న పనిని ఆపేయ్’ అంటూ ఆదేశించారు. అయితే తాను అతడి గొంతును గుర్తుపట్టలేకపోతున్నానని ఆమె పేర్కొనడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఎంత ధైర్యం నా గొంతే గుర్తు పట్టలేవా? నీపై చర్య తీసుకంటా’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తర్వాత వీడియో కాల్‌లోకి వచ్చారు. అక్రమ తవ్వకందారులపై చర్యలు ఆపేయాలంటూ ఆయన ఆమెను ఆదేశించారు. ఒక నిర్మాణ ప్రాజెక్టు కోసం సోలాపూర్ జిల్లా కుర్దు గ్రామంలో ఎర్రమట్టిని విచ్చలవిడిగా తవ్వేస్తుండటంతో దానిపై విచారణకు అంజలి కృష్ణ అధికారులతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడి ఎన్సీపీ కార్యకర్తలతో అధికారులకు వాగ్వాదం జరిగింది. ఎన్సీపీ కార్యకర్త బాబా జగతప్ నేరుగా డిప్యూటీ సీఎంకు ఫోన్ చేసి, ఆయనతో మాట్లాడాలని కృష్ణకు ఫోన్ అందించిన క్రమంలో పై సంభాషణ జరిగింది.
మహిళా అధికారుల పట్ల తనకు పూర్తి గౌరవం ఉందని.. చట్టానికి కట్టుబడి ఉంటానని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇసక, మైనింగ్ అక్రమ కార్యకలాపాలకు నేను ఎప్పటికి వ్యతిరేకమే అని ఆయన అన్నారు.