Akash Prime: 15,000 అడుగుల ఎత్తులో ‘ఆకాశ్ ప్రైమ్’ విజయవంతం..!

వైమానిక రక్షణలో మరో అస్త్రం..;

Update: 2025-07-17 01:00 GMT

భారత సైనిక దళాల వైమానిక రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా మరో కీలక విజయాన్ని దేశం సాధించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ‘ఆకాశ్ ప్రైమ్’ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థను భారత ఆర్మీ లడఖ్‌లో 15,000 అడుగుల ఎత్తులో విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షలు బుధవారం భారత ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ విభాగం ఆధ్వర్యంలో రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (DRDO) సీనియర్ అధికారుల సమక్షంలో నిర్వహించబడ్డాయి.

ఈ ప్రయోగాల్లో ఆకాశ్ ప్రైమ్ రెండు వేగంగా కదిలే గగన లక్ష్యాలను నేరుగా తాకి ధ్వంసం చేసింది. అధిక ఎత్తులోని తక్కువ ఆక్సిజన్ ఉన్న వాతావరణంలోనూ ఈ మిసైల్ వ్యవస్థ సమర్థంగా పనిచేయగలదని ఈ విజయంతో నిరూపితమైంది. రక్షణ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆకాశ్ ప్రైమ్ యుద్ధ పరిస్థితుల్లోనూ కచ్చితమైన పనితీరు చూపగలదు. ముఖ్యంగా శత్రుదేశాల నుంచి వచ్చే డ్రోన్లు, యుద్ధ విమానాలను ఎదుర్కొనడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ విజయవంతమైన పరీక్షల అనంతరం.. ఆకాశ్ ప్రైమ్ మిసైల్ సిస్టమ్‌ను భారత ఆర్మీ మూడో, నాల్గవ ‘ఆకాశ్’ రెజిమెంట్లలో భాగంగా తీసుకునే అవకాశం ఉంది. ఇది కొత్తగా పరీక్షించబడిన వ్యవస్థ కాదు. గతంలో “ఆపరేషన్ సిందూర్” సమయంలో ఈ మిసైల్ వ్యవస్థ తన సామర్థ్యాన్ని ఇప్పటికే చాటింది. అప్పట్లో పాకిస్తాన్ సైన్యం ఉపయోగించిన చైనీస్ యుద్ధ విమానాలు, టర్కిష్ డ్రోన్లను అడ్డుకోవడంలో ఆకాశ్ ప్రైమ్ కీలకంగా పనిచేసింది. DRDO అభివృద్ధి చేసిన ఈ సిస్టమ్‌ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ ఆధారంగా రూపొందించబడింది. అధిక ఎత్తు, తక్కువ ఉష్ణోగ్రతలు, తక్కువ వాయు పీడన లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ శత్రు విమానాలను తాకడానికి ఇది అనువుగా ఉంటుంది.

Tags:    

Similar News