అక్షయ్ కుమార్ ఔదార్యం.. 650 మంది స్టంట్‌మెన్‌లకు బీమా సౌకర్యం..
యాక్షన్ కమ్యూనిటీ పట్ల తనకున్న లోతైన గౌరవాన్ని ప్రతిబింబించే ఒక ముఖ్యమైన పనిని అక్షయ్ కుమార్ చేశారు. స్టంట్ కళాకారుల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.;
స్టంట్ కళాకారుల పట్ల తనకున్న గౌరవాన్ని ప్రతిబింబించే ఒక ముఖ్యమైన పనిని అక్షయ్ కుమార్ చేశారు. భారతదేశం అంతటా 650 మంది స్టంట్‌మెన్ మరియు స్టంట్ ఉమెన్‌ల జీవితాలకు బీమా కల్పించే బాధ్యతను స్వయంగా స్వీకరించారు, చిత్ర పరిశ్రమలో తరచుగా నిర్లక్ష్యానికి గురవుతున్న విభాగంపై దృష్టి పెట్టి అందరినీ ఆకట్టుకున్నారు.
ఒక సినిమా తీయాలంటే దాని వెనుక ఎంతో మంది కళాకారుల కష్టం ఉంటుంది. కానీ మనం చూసేది హీరో హీరోయిన్లను మాత్రమే.. అదే యాక్షన్ హీరో అయితే ఆయన కోసం సరికొత్త స్టంట్ లను క్రియేట్ చేసి ఆ హీరోను మరింత ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు స్టంట్ మాస్టర్లు.. ఇందు కోసం వారెన్నో రిస్కులు తీసుకుంటారు.. ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటారు.
పా రంజిత్ దర్శకత్వంలో నటుడు ఆర్య నటిస్తున్న తమిళ చిత్రం సెట్‌లో స్టంట్‌మ్యాన్ రాజు దురదృష్టవశాత్తూ మరణించిన విషయం చిత్ర యూనిట్ ని కలచి వేసింది. వినోద ప్రపంచంలో భద్రతా సమస్యలపై మరోసారి అందరి దృష్టి మళ్లింది.
చాలా సంవత్సరాలుగా, స్టంట్ మాస్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి అధిక-రిస్క్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. సరైన భద్రతా చర్యలు లేదా వైద్య సహాయం లేకుండా సినిమా కోసం రిస్క్ తీసుకుంటారు. వారిలో చాలా మందికి బీమా సౌకర్యం లేదు, అంటే చిన్న గాయం అయితే కూడా భారీగా చికిత్స కోసం ఖర్చుపెట్టాల్సి ఉంటుంది.
దీని గురించే వారి కుటుంబాలు ఎల్లప్పుడూ ఆందోళన చెందుతుంటాయి. కుటుంబంలో సంపాదించే ఒకే ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ప్రమాదానికి గురైతే వారి జీవితాలు ఇక రోడ్డున పడ్డట్లే.
అందుకే యాక్షన్ హీరోనే కాదు మంచి మనసున్న అక్షయ్ కుమార్ స్టంట్ మాస్టర్లకు బీమాను అందించడంతో పాటు, వారికి భవిష్యత్తు భద్రతను అందిస్తున్నాడు.
ధడక్ 2, జిగ్రా, గుంజన్ సక్సేనా, యాంటిమ్, మరియు OMG 2 వంటి చిత్రాలకు సహకరించిన ప్రముఖ స్టంట్‌మ్యాన్ విక్రమ్ సింగ్ దహియా, అక్షయ్ కుమార్ చొరవకు ధన్యవాదాలు తెలిపారు.
"అక్షయ్ సర్ కి ధన్యవాదాలు, బాలీవుడ్ లో దాదాపు 650 నుండి 700 మంది స్టంట్ మెన్ మరియు యాక్షన్ సిబ్బంది ఇప్పుడు బీమా పరిధిలోకి వచ్చారు" అని ఆయన అన్నారు. "ఈ పాలసీలో ఆరోగ్యం మరియు ప్రమాద కవరేజ్ రెండూ ఉన్నాయి. ఒక స్టంట్ పెర్ఫార్మర్ గాయపడితే, సెట్ లో ఉన్నా లేదా బయట ఉన్నా, వారు రూ. 5 నుండి రూ. 5.5 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స పొందవచ్చు."
అతని ప్రయత్నాలను స్టంట్ సమాజం అభినందించడమే కాకుండా, ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు నిజమైన మార్పును ఎలా తీసుకురాగలరో చెప్పడానికి ఒక ప్రమాణంగా అక్షయ్ ని ఉదహరిస్తున్నారు.