Tamilanadu : తమిళనాడులో సంచలనం రేపుతున్న లాకప్ డెత్

స్టాలిన్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్;

Update: 2025-07-01 08:15 GMT

తమిళనాడులో జరిగిన లాకప్ డెత్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. పోలీస్ కస్టడీలో ఆలయ గార్డు అజిత్ కుమార్ మరణించిడంపై పొలిటికల్‌గా తీవ్ర దుమారం రేపుతోంది. డీఎంకే పాలనలో లాకప్ డెత్‌లకు రాష్ట్రం మాతృభూమిగా మారిందంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.

గత వారం మాదపురం కాళీఅమ్మన్ ఆలయానికి మహిళ కారులో వచ్చింది. అక్కడే పని చేస్తున్న ఆలయ గార్డు అజిత్ కుమార్‌కు తాళాలు ఇచ్చి పార్కు చేయమని చెప్పింది. అయితే అతడికి కారు నడపడం చేతకాకపోవడంతో మరొకరి సహాయం తీసుకున్నాడు. అయితే దర్శనం అనంతరం కారు తీసుకెళ్తుండగా కారులో 80 గ్రాముల బంగార ఆభరణాలు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జూన్ 27న అజిత్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీస్ విచారణలో అజిత్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరు అయింది. పోలీసులు కొట్టడం వల్లే అజిత్ ప్రాణాలు పోయాయంటూ ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. డీఎంకే ప్రభుత్వంపై అన్నాడీఎంకే, బీజేపీ విమర్శలు గుప్పించింది. మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. అజిత్ కుమార్ దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లు వెల్లడించారు. అయితే ఆభరణాలు దాచి పెట్టిన చోటికి తీసుకెళ్లినప్పుడు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా మూర్ఛ వ్యాధితో మరణించినట్లు చెప్పుకొచ్చారు. విచారణలో అనేక పేర్లు చెప్పాడని.. చివరికి అతడే నేరాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటన రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. హైకోర్టు కూడా విచారణ చేపట్టింది. అన్నాడీఎంకే నేతృత్వంలోని ప్రతిపక్షాలు న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. పోలీసు సిబ్బందిని అరెస్టు చేయాలని కోరాయి. అలాగే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. డీఎంకే పాలనలో 24 కస్టోడియల్ మరణాలు జరిగాయని తమిళనాడు బీజేపీ ఆరోపించింది. ఇక సోమవారం మద్రాస్ హైకోర్టు ఈ విషయాన్ని స్వయంగా విచారణకు స్వీకరించింది. అజిత్ ఏమైనా ఉగ్రవాదా? అని నిలదీసింది. అతనిపై ఎందుకు దాడి జరిగిందని ప్రశ్నించింది.

Tags:    

Similar News