Supreme Court : అస్తిత్వ సంక్షోభంలో హిమాలయన్‌ రాష్ట్రాలు..

కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు

Update: 2025-09-24 07:00 GMT

 ఈ ఏడాది రుతుపవనాలు  హిమాలయన్‌ రాష్ట్రాల లో అల్లకల్లోలం సృష్టించాయి. అతివృష్టి, వరదలు పోటెత్తడం, కొండచరియలు విరిగిపడటం లాంటి కారణాలతో హిమాచల్‌ప్రదేశ్‌  రాష్ట్రంలో ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న హిమాలయన్‌ పర్యావరణ వ్యవస్థ పై సుప్రీంకోర్టు  కీలక వ్యాఖ్యలు చేసింది. హిమాలయాల ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలు తీవ్రమైన అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని వ్యాఖ్యానించింది.

పర్యాటకం కోసం, నిర్మాణాల కోసం, మైనింగ్‌ కోసం పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని, పర్యాటకాన్ని, నిర్మాణాలను, గనుల తవ్వకాలను నియంత్రించడం కోసం హిమాచల్‌ప్రదేశ్‌ అవలంభిస్తున్న విధానాలపై సర్వోన్నత న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది. ఈ ఏడాది రుతుపవనాలు హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి. క్లౌడ్‌బరస్ట్‌లు, వరదలు, కొండచరియలు విరిగిపడటం లాంటి ఘటనలతో రెండు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. ఆ రెండు రాష్ట్రాల్లోని పలు పట్టణాలు, గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో అయితే ఏకంగా ఊళ్లకే ఊళ్లే కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు హిమాలయన్‌ రాష్ట్రాలన్నీ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని వ్యాఖ్యానించింది.

‘ఈ వర్షాకాలం హిమాచల్‌ప్రదేశ్ పర్యావరణ వ్యవస్థను విధ్వంసం చేసింది. వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాలు, పోటెత్తిన వరదలు తీవ్రంగా ఆస్తి, ప్రాణ నష్టం కలిగించాయి. వరదల్లో అక్కడి శాశ్వత నిర్మాణాలు, తాత్కాలిక భవనాలు, పెద్ద సంఖ్యలో ఇళ్ళు కొట్టుకుపోయాయి. కొండచరియల కింద పలు ప్రాంతాలు నలిగిపోయాయి. హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు హిమాలయన్‌ ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలు తీవ్రమైన అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి’ అని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని దుర్బలమైన పర్యావరణ పరిస్థితుల గురించి సవివరంగా కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది.

ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం, అడవుల నరికివేత, పరిహార అటవీకరణ, రహదారుల నిర్మాణం, జలవిద్యుత్ ప్రాజెక్టులు, మైనింగ్ ప్రాజెక్టులు, పర్యాటకానికి సంబంధించి పలు ప్రశ్నలు సంధించింది. మళ్లీ విచారణ జరిగే నాటికి సమగ్ర వివరాలను తెలియజేయాలని ఆదేశిస్తూ.. తదపరి విచారణను అక్టోబర్ 28కి వాయిదావేసింది.

Tags:    

Similar News