Ayodhya:,మారిపోతున్న అయోధ్య రూపు రేఖలు

ఇక్కడ ప్రతిదీ ప్రత్యేకమే..

Update: 2024-01-14 01:00 GMT

అయోధ్యలో అడుగడుగు ఆధ్యాత్మికతతో ఉట్టిపడుతోంది. ప్రపంచమే అబ్బురపడేలా ఈనెల 22న జరిగే ప్రతిష్టాపన మహోత్సవానికి అయోధ్యను సర్వంగా సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా భారత సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేలా ఇప్పటికే అయోధ్యలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎన్నో విశిష్టతలు ఉన్న అయోధ్య మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అయోధ్యలోని గుప్తర్ ఘాట్ నుంచి నిర్మల్‌కుండ్ వరకు మధ్య ఉన్న 10.2 కిలోమీటర్లు దూరానికి 470 సోలార్ స్ట్రీట్ లైట్లను అమర్చారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్డ్ స్ట్రీట్ లైట్ల లైన్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అయోధ్యలోని ఈ సోలార్‌ లైట్‌ స్ట్రీట్‌..గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుది. ఇప్పటికే 70 శాతం సోలార్‌ లైట్లను అమర్చడం పూర్తయిందని... మిగిలిన 160 సోలార్ స్ట్రీల్ లైట్లను జనవరి 22 లోపు అమరుస్తామని ఉత్తరప్రదేశ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది.

ఇంతకుముందు కూడా అయోధ్యలో జరిగిన దీపోత్సవం కూడా... గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో మట్టి దీపాలను వెలిగించడతో ఈ రికార్డు వచ్చింది. మరోవైపు జనవరి 22న జరిగే రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. వేలమంది సాధువులు.. ప్రముఖులు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో హాజరుకానున్నారు. 

అయోధ్య నగర సుందరీకరణ పనుల్లో భాగంగా నగర పాలక యంత్రాంగం యూనిఫాం బిల్డింగ్ కోడ్ అమలు చేస్తోంది. ఆ ప్రకారం నగరంలో భవంతులను 4 విభాగాలు వర్గీకరించింది. వాణిజ్య, వ్యాపార భవనాలు ఒక కేటగిరీలో, నివాస భవనాలు ఒక కేటగిరీలో వర్గీకరించారు. అలాగే ఆలయాలు, వివిధ మతాలకు చెందన మందిరాలు, ప్రార్థనా స్థలాలు, ఆశ్రమాలను ఒక కేటగిరీలోకి తీసుకురాగా.. చారిత్రక కట్టడాలు, భవంతులను 4వ కేటగిరీలో చేర్చారు. ఈ నాలుగు కేటగిరీలకు వేర్వేరు కలర్ కోడింగ్ చేసి, ఆ మేరకు యూనిఫాం డిజైన్, స్టైల్, డిజైన్ అమలు చేస్తున్నారు. సాధారణంగా ఈ తరహా నిర్మాణ నిబంధనలు యురోపియన్ దేశాల్లో కనిపిస్తాయి. భవనాల ఆర్కిటెక్చర్, డిజైన్ విషయంలో ఆ దేశాలు చాలా తమ సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడే నిర్మాణ శైలితో నిబంధనల మేరకు మాత్రమే నిర్మించేలా చర్యలు తీసుకుంటాయి.

అందుకే అక్కడి నగరాల్లో కొన్ని వీధులను చూస్తుంటే ముచ్చటగొలిపే రంగులతో, ఆకృతులతో ఉన్న భవనాలు ఆకట్టుకుంటాయి. ఈ తరహాలోనే అయోధ్య నగరంలో కూడా భవంతులు, దుకాణ సముదాయాలన్నీ ప్రభుత్వం నిర్దేశించిన డిజైన్లు, రంగులతోనే రూపుదిద్దుకుంటున్నాయి. అయోధ్య – ఫైజాబాద్ రహదారిని విస్తరించిన నేపథ్యంలో అనేక భవంతులను తొలగించాల్సి వచ్చింది. రోడ్డుకు ఆనుకుని కనిపించే ప్రతి భవంతి, దుకాణ సముదాయం ఏకరూపత కలిగి ఉండేలా ప్రభుత్వం యూనిఫాం బిల్డింగ్ కోడ్ అమలు చేస్తోంది. చాలా వరకు నిర్మాణ దశలోనే ఉండడం వల్ల నగర వీధులు పూర్తి ఆకృతి సంతరించుకోలేదు. కొన్ని నెలల్లో ఈ పనులన్నీ పూర్తయ్యాక అయోధ్యను చూసినవాళ్లు ఆశ్చర్యపోక తప్పదు. 

Tags:    

Similar News