Amarnath Cave Floods : 40 మంది గల్లంతు.. ఇంకా లభించని ఆచూకీ..

Amarnath Cave Floods : అమర్‌నాథ్ వరదల్లో ఇప్పటివరకు 40 మంది గల్లంతయ్యారు, ఇంకా వారి ఆచూకీ లభించలేదు.

Update: 2022-07-09 10:45 GMT

Amarnath Cave Floods : పవిత్ర పుణ్యక్షేత్రం అమర్‌నాథ్‌ సమీపంలో వరద బీభత్సంలో మృతుల సంఖ్య 16కు చేరగా.. మరో 40 మందిదాకా గల్లంతయ్యారు. శుక్రవారం సాయంత్రం కురిసిన కుంభకృష్టితో ఆకస్మిక వరద పోటెత్తింది. కొండల పై నుంచి భారీఎత్తున వర్షపు నీరు ముంచెత్తింది. పెద్ద ఎత్తున రాళ్లు, బురద కొట్టుకొచ్చాయి. ప్రవాహ ఉద్ధృతికి అమర్‌నాథ్‌ క్షేత్రానికి సమీపంలోని బేస్‌ క్యాప్‌ దెబ్బతింది.

యాత్రికులకు ఆహారం అందించేందుకు ఏర్పాటుచేసిన 3 వంటశాలలు, 25 గుడారాలు కూడా ధ్వంసమయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది యాత్రికులేనని తెలుస్తోంది. అటు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం మంచు లింగం సమీపంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా... సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. NDRFతో ఆర్మీ, CRPF, భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కుండపోత వానలతో మార్గం ధ్వంసమైంది దీంతో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

అమర్నాథ్‌ జలప్రళయంతో చనిపోయినవారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు అన్నిఏర్పాటు చేశారు. బేస్‌క్యాంపులో భద్రతా సిబ్బంది మృతుల వివరాలు నమోదు చేసుకుని ఆయా రాష్ట్రాలకు తరలించనున్నారు. ఇక గాయపడిన వారికి మూడు ప్రాథమిక ఆస్పత్రుల్లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

అటు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. యాత్ర నిలిపి వేయటంతో హైదరాబాద్‌కుచెందిన భక్తులు పహల్‌గాంలోని బేస్‌క్యాంప్‌లోనే నిలిచిపోయారు. అందరూ చూస్తుండగానే కొండల పైనుంచి భారీఎత్తున వర్షపు నీరు ముంచెత్తినట్లు భక్తులు పేర్కొన్నారు. కొండలపై నుంచి పెద్ద ఎత్తున రాళ్లు, బురద కొట్టుకొచ్చినట్లు తెలిపారు. వరద సమయంలో యాత్రికులు ప్రాణ భయంతో పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగినట్లు చెప్పారు.

అమర్నాథ్‌ జలవిలయం ఘటనలో శంషాబాద్‌కు చెందిన ఆరుగురు తృటిలో ప్రాణాలతో బయట పడ్డారు. మంచు లింగం దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతుండగా.. ఒక్కసారిగా కురిసిన వర్షానికి గృహ వద్ద కొనచరియలు విరిగిపడ్డా.. ప్రమాద సమయంలో శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి, చిన్న గోల్కొండ, శంకరాపూర్‌ గ్రామాలకు చెందిన ఆరుగురు అక్కడే ఉన్నారు. ఒక్కసారిగా వరదలు రావడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. అయితే బాధితులను కాపాడిన ఆర్మీ అధికారులు.. వారిని పెహాల్గావ్‌లోని బేస్‌ క్యాంపుకు తరలించారు. తాము క్షేమంగానే ఉన్నామని శంషాబాద్‌కు వాసులు తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

అటు అమర్నాథ్‌ గుహ వద్ద పరిస్థితిని జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్ సిన్హా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు..త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర బలగాలను, జమ్మూకశ్మీర్‌ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అటు విపత్తు నేపథ్యంలో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News