Amarnath Yatra: మొదలైన అమర్‌నాథ్ యాత్ర,ఈ నెల 29 నుంచి ప్రారంభం
ఉగ్రదాడుల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత;
హిందువుల ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటైన అమర్‌నాథ్ గుహలో శనివారం ‘మొదటి పూజ’ జరిగింది. శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు చైర్మన్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తన అధికారిక పోస్ట్‌లో పోస్ట్ చేశారు. బాబా అమర్‌నాథ్ జీ ఆశీర్వాదం తీసుకొని ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, పురోగతి, శ్రేయస్సు కోసం ప్రార్థించారు. కాశ్మీర్ హిమాలయాలలో సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న గుహ దేవాలయానికి పవిత్ర యాత్ర ఎల్లప్పుడూ మత సామరస్యానికి చిహ్నంగా ఉందని.. యాత్రికులు గుహ ఆలయానికి చేరుకోవడానికి స్థానిక ముస్లింలు సహాయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది జూన్ 29 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. 52 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 19న రక్షాబంధన్, శ్రావణి పూర్ణిమతో ముగుస్తుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇక్కడికి సందర్శిస్తుంటారు.
ఈ నెల 29న ప్రారంభం కానున్న యాత్ర సజావుగా సాగేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. యాత్ర ప్రారంభానికి సూచకంగా శనివారం నిర్వహించిన ‘ప్రథమ పూజ’లో వర్చువల్‌గా పాల్గొన్న ఆయన.. అమర్‌నాథ్ యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
ఇటీవల జమ్మూ-కశ్మీర్‌లో వరుస ఉగ్ర దాడులు చోటుచేసుకున్న నేపథ్యంలో యాత్రికుల భద్రత విషయంలో సిబ్బంది పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. జమ్మూ-శ్రీనగర్ హైవే వెంబడి భద్రత ఏర్పాట్లను జమ్మూ ఏడీజీపీ ఆనంద్ జైన్ సమీక్షించారు. ఉగ్రకార్యకలాపాలను కట్టడి చేసేందుకు నిరంతరం అప్రమత్తతంగా ఉండాలని అధికారులకు సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రకృతి విపత్తుల సమయంలో సత్వర చర్యలు చేపట్టేలా సహాయక సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పారు. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర జూన్ 29 నుంచి ఆగస్టు 19 వరకు కొనసాగనుంది. గత ఏడాది 4.5 లక్షల మంది యాత్రికులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు.