H1B VISA HIRING: హెచ్-1బీ జాబ్స్ భర్తీలో బ్యాంకింగ్, టెలికాం దూకుడు- వెనుకంజలో టెక్ దిగ్గజాలు
బ్లూమ్‌బర్గ్ నివేదికలో వెల్లడి;
హెచ్-1బీ వీసాల జారీలో అమెరికన్ టెక్ కంపెనీలు ఇప్పుడు వెనుకబడ్డాయి. ఎందుకంటే ఇప్పుడా స్థానాన్ని బ్యాంకింగ్, టెలికం రంగ సంస్థలు ఆక్రమించాయి. సిటీ గ్రూప్, క్యాపిటల్ వన్, ఏటీ అండ్ టీ, వాల్‌మార్ట్, యూఎస్‌ఏఏ, వేరిజాన్ లాంటి కంపెనీలు పెద్ద సంఖ్యలో నిపుణులను నియమించుకుంటున్నాయి. దీంతో ఉద్యోగాల భర్తీలో సిలికాన్ వ్యాలీలోని దిగ్గజ టెక్ కంపెనీలు వెనుక ఉండిపోయాయి. ఈ వివరాలను బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో వెల్లడించింది. భారత్, చైనా సహా వివిధ దేశాల్లోని టెక్ నిపుణులను అమెరికాకు రప్పించడమే ఈ వీసా వ్యవస్థ లక్ష్యం. తొలుత టెక్ కంపెనీలను దృష్టిలో పెట్టుకునే దీనిని ప్రవేశపెట్టారు. అయితే ఈ వీసాలను వినియోగించుకోవడంలో టెక్ కంపెనీలను టెలికం, బ్యాంకింగ్ కంపెనీలు దాటేశాయి. 2020 మే నుంచి 2024 మే మధ్య కాలంలో బ్యాంకింగ్ సేవల సంస్థ సిటీ గ్రూప్ 3 వేల మందికి పైగా హెచ్-1బీ వర్కర్లను నియమించింది. ఆ నాలుగేళ్లలో ఎన్‌విడియా, ఒరాకిల్, క్వాల్ కామ్‌ల కంటే సిటీ గ్రూపే ఈ వీసాలు అధికంగా వాడుకుంది.
అధిక శాతం కాంట్రాక్టు సంస్థల ద్వారానే?
హెచ్-1బీ వీసాల జారీలో చాలామందిని సిటీ గ్రూప్ రిక్రూట్ చేసుకోలేదని, కాంట్రాక్టు సంస్థల ద్వారా భర్తీ చేసుకుందని బ్లూమ్‌బర్గ్ తన అధ్యయన నివేదికలో ప్రస్తావించింది. వీరిలో మూడింట రెండో వంతు మంది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) లాంటి పలు ఔట్ సోర్సింగ్ కంపెనీల ద్వారా భర్తీ అయినట్టు పేర్కొంది. ఏటా అమెరికా కంపెనీలు జారీ చేస్తున్న 85 వేల కొత్త హెచ్1బీ వీసాలలో సగభాగాన్ని మధ్యవర్తిత్వ కంపెనీలు దక్కించుకుంటున్నాయని, వాటి ద్వారానే రిక్రూట్‌మెంట్ జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అమెరికా సమాన ఉద్యోగ అవకాశాల కమిషన్ దర్యాప్తు జరుపుతున్నది. అలాగే ఈ నివేదిక ప్రకారం పలు రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు ఒకే ఉద్యోగి కోసం వేర్వేరు కంపెనీలు తరపున హెచ్-1బీ వీసా కోసం రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నాయి. దీంతో వారికి వీసాలు దక్కే అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు అవి ఈ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాయి.
ఒకే అర్హత, అనుభవమున్నా తక్కువ జీతాలు
అమెరికా కంపెనీల ద్వారా హెచ్-1బీ వీసాలు పొందిన ఉద్యోగుల కన్నా రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా వచ్చిన ఉద్యోగులకు తక్కువ జీతం లభిస్తున్నదని నివేదిక తెలిపింది. నేరుగా చేరిన ఉద్యోగులకు ఏటా రూ.1.21 కోట్ల వేతన ప్యాకేజీ వస్తుండగా, రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ద్వారా వచ్చిన వారికి ఏటా రూ.80 లక్షల వార్షిక వేతనం మాత్రమే లభిస్తున్నది. ఇద్దరి విద్యార్హత, ఉద్యోగ హోదా, అనుభవం, చేసే పని ఒకటే అయినప్పటికీ తక్కువ వేతనంతో భారీగా నష్టపోతున్నారు. కాగా, తమపై కొందరు తప్పుడు ఆరోపణలు చేయడాన్ని టీసీఎస్ ఖండించింది. ఉద్యోగ భర్తీలో తాము ఎలాంటి వివక్ష చూపడం లేదని స్పష్టం చేసింది. అలాగే నిపుణులను భర్తీ చేసుకునే క్రమంలో తాము చట్టాలు, నిబంధనలు పూర్తిగా పాటిస్తున్నామని సిటీ గ్రూప్ తెలిపింది.