Amit Shah: అంబేద్కర్‌ అనడం ఫ్యాషనైపోయింది- అమిత్ షా

కలలో కూడా అంబేద్కర్ ఆలోచనలను అవమానించలేని పార్టీ నుంచి వచ్చానన్న అమిత్ షా;

Update: 2024-12-19 00:26 GMT

కలలో కూడా అంబేద్కర్ ఆలోచనలను అవమానించలేని పార్టీ, సిద్ధాంతం నుంచి తాను వచ్చానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాజ్యసభలో తాను చేసిన పూర్తి ప్రసంగాన్ని మీడియా కూడా ప్రజలకు చూపించాలన్నారు. నిన్న రాజ్యసభలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రతిపక్షాలు పదేపదే అంబేద్కర్... అంబేద్కర్... అంబేద్కర్ అంటున్నాయంటూ కాంగ్రెస్ సహా విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో అమిత్ షా.. అంబేద్కర్‌‌ను అవమానించారంటూ ఇండియా కూటమి నేతలు ఆరోపించారు. ఈ అంశంపై ఆయన ఈరోజు స్పందించారు.

కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్‌కు వ్యతిరేకమన్నారు. రాజ్యసభలో తాను నిన్న చేసిన వ్యాఖ్యలను వక్రీకరించిందన్నారు. కాంగ్రెస్ దేశంలో అవాస్తవాలను వ్యాపింప చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని, దీనిని తాను ఖండిస్తున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీయే అంబేద్కర్ వ్యతిరేకి.. రిజర్వేషన్ వ్యతిరేకి... రాజ్యాంగ వ్యతిరేక పార్టీ అని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ఎప్పుడూ అంబేద్కర్ స్మారకాన్ని నిర్మించలేదన్నారు. కానీ బీజేపీ మాత్రం ఆయనకు ఎప్పుడూ గౌరవాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. తన ప్రసంగం రాజ్యసభ రికార్డుల్లో చాలా స్పష్టంగా ఉందని వెల్లడించారు. తాను రాజీనామా చేయాలని ఖర్గే డిమాండ్ చేస్తున్నారని, అలా చేయడానికి తాను సిద్ధమే అన్నారు. కానీ మరో పదిహేనేళ్లు వారు ప్రతిపక్షంలోనే ఉండాలని, తన రాజీనామా వల్ల వారికి వచ్చేదేమీ లేదన్నారు.

అసలేం జరిగింది? షా ఏమన్నారు??

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరిగింది. ఈ క్రమంలో హోంమంత్రి అమిత్‌షా మాట్లాడుతూ అంబేద్కర్‌ను ఉద్దేశిస్తూ పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘అబీ ఏక్‌ ఫ్యాషన్‌ హో గయా హై అంబేద్కర్‌, అంబేద్కర్‌, అంబేద్కర్‌, అంబేద్కర్‌, అంబేద్కర్‌, అంబేద్కర్‌. ఇత్నా నామ్‌ అగర్‌ భగవాన్‌ కా లేతే తో సాత్‌ జన్మన్‌ తక్‌ స్వర్గ్‌ మిల్‌ జాతా (అంబేద్కర్‌, అంబేద్కర్‌, అంబేద్కర్‌, అంబేద్కర్‌, అంబేద్కర్‌, అంబేద్కర్‌ అంటూ పదే పదే అనడం ఇప్పుడు ఓ ఫ్యాషన్‌గా మారింది. దీనికి బదులుగా దేవుడిని ఇన్నిసార్లు స్మరిస్తే.. స్వర్గానికి వెళ్లొచ్చు)’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. షా వ్యాఖ్యలను విపక్ష నేతలు సహా నెటిజన్లు కూడా ఖండించారు.

Tags:    

Similar News