Pahalgam Terror Attack: పాక్ జాతీయులను పంపించేయండి, ఉగ్రవాదులను జల్లెడపడుతున్న భద్రతా బలగాలు
రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలికాన్ఫరెన్స్‌లో అమిత్ షా;
పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య పూర్తిగా క్షీణించిన దౌత్య సంబంధాలు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. సింధూ జలాల నుంచి చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్లనివ్వరాదని నిర్ణయించిన భారత ప్రభుత్వం...ఆ దేశ ప్రజలకు జారీచేసే 14 రకాల వీసాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఆ వీసాలపై వచ్చిన వారందరూ ఆదివారంలోగా దేశం వీడి వెళ్లాలని ఆదేశించింది. మరోవైపు పహల్గాంలో పాశవిక దాడికి పాల్పడిన ముష్కరుల కోసం భద్రతా దళాలు వేటను ముమ్మరం చేశాయి. జమ్మూకశ్మీర్‌లోని బాందీపొరాలో నిషేధిత లష్కరే తయ్యిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని హతమార్చాయి. నియంత్రణ రేఖ వెంట పాక్ సైనికులు గురువారం రాత్రి కాల్పులకు తెగబడగా భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది.
సింధూ జలాల కట్టడి :
సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తోన్న పాకిస్థాన్‌కు సింధూ జలాలు ఒక్క చుక్క కూడా పోకుండా కట్టడి చేసేందుకు భారీ వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ వెల్లడించారు. హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం దిల్లీలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం పాటిల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘పాకిస్థాన్ పట్ల వ్యవహరించాల్సిన తీరుపై ప్రధాని మోదీ అనేక ఆదేశాలిచ్చారు. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత నిర్ణయాన్ని పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగానే సమావేశం నిర్వహించాం. హోం మంత్రి అమిత్ షా అనేక సూచనలు చేశారు’ అని పాటిల్ తెలిపారు. సీనియర్ మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు.
రాష్ట్రాలకు హోంశాఖ ఆదేశాలు :
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న పాకిస్థానీలను గుర్తించి వాళ్ల దేశానికి పంపించాలని ఆదేశించారు. గడువు తేదీ ముగిశాక పాక్ జాతీయులెవరూ మన దేశంలో ఉండకుండా చూడాలని స్పష్టం చేశారు. తొలుత స్థానికంగా ఉంటున్న పాకిస్థానీలను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి ఇవ్వాలని, అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు. మంగళవారం నాటి ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ పౌరులకు వీసా సేవలను భారత్ నిలిపివేసింది. ఈ ఆదేశాలు వెలువడే నాటికి జారీ అయిన వీసాలు ఈ నెల 27 తర్వాత రద్దవుతాయని, గడువు ముగిసేలోగా పాక్ పౌరులంతా దేశాన్ని వీడి వెళ్లాలని తెలిపింది. అయితే, ఈ వీసాల రద్దు నిర్ణయం... పాకిస్థానీ హిందువులకు జారీ చేసిన దీర్ఘకాల వీసాలకు వర్తించదని కేంద్రం స్పష్టతనిచ్చింది. తాజా ఆదేశాలతో పలువురు పాక్ జాతీయులు అటారీ సరిహద్దు ద్వారా దేశాన్ని వీడి వెళ్లిపోతున్నారు.