Anil Ambani: ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ
ఫారిన్ ఎక్స్‌చేంజ్ ఉల్లంఘన కేసులో ప్రశ్నించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్;
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. ఫారిన్ ఎక్స్‌చేంజ్ ఉల్లంఘన కేసులో ఈడీ ఆయన్ని ప్రశ్నించినట్లుగా సమాచారం.
ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్, 1999 (ఫెమా) కింద అనిల్ అంబానీ ముంబైలోని ఈడీ ఆఫీసులో విచారణకు హాజరైనట్టుగా తెలుస్తోంది. వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఆయన ఆఫీసు నుంచి వెళ్లిపోయారు. గతంలో 2020లో ఈడీ ఆఫీసు ముందు మనీల్యాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూపు చైర్మెన్ అనిల్ అంబానీ హాజరయ్యారు. ఎస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్‌తో పాటు ఇతరుల్ని కూడా ఈడీ ప్రశ్నించింది. తరువాత రాణా కపూర్, తదితరులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
యస్ బ్యాంక్ నుంచి అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు రూ. 12,800 కోట్ల రుణాలు పొందాయి. రిలయన్స్‌తోపాటు, పాటు చాలా కంపెనీలు బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో మొండి బకాయిలుగా మారిపోయాయి. ఈ కేసులో విచారణలో భాగంగా ఈడీ గతంలో అంబానీకి సమన్లు జారీ చేసి విచారించింది. ఇక మార్చి నెలలో ఐటీ శాఖ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై బాంబే హైకోర్టు తాత్కాలిక స్టే ఆర్డర్ ఇచ్చింది.