ANNA HAZARE: అన్నా హజారే సంచలన ప్రకటన
మరోసారి నిరాహార దీక్షకు దిగుతున్నట్లు కీలక ప్రకటన
ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే.. మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రజా సంక్షేమానికి అత్యంత కీలకమైన ఈ చట్టం అమలు విషయంలో ప్రభుత్వం పదేపదే హామీలు ఇచ్చి, వాటిని విస్మరిస్తోందని అన్నారు. ప్రభుత్వ ఈ నిర్లక్ష్యానికి నిరసనగా తాను చేపట్టబోయే దీక్షే తన జీవితంలోని చివరి నిరసన కావచ్చని హజారే భావించారు. ఆయన జనవరి 30 నుంచి దీక్ష ప్రారంభించనున్నారు. 2022లో కూడా ఇదే డిమాండ్‌తో రాలేగావ్ సిద్ధిలో హజారే నిరాహార దీక్ష చేశారు. ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి లోకాయుక్తను అమలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆయన నిరసనను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత ఒక ప్రత్యేక కమిటీ చట్టాన్ని తయారు చేసింది. ఈ బిల్లును మహారాష్ట్ర శాసనసభలోని ఉభయ సభలు ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. అయితే ఆ చట్టం ఇప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కాలేదని హజారే తీవ్రంగా విమర్శించారు. ఈ విషయం మీద ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు తాను ఏడు లేఖలు రాసినప్పటికీ, ఏ ఒక్క లేఖకూ స్పందన రాకపోవడం బాధాకరమని అన్నారు. ఇన్నేళ్లు గడిచినా లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. హజారే నిరాహార దీక్ష నిర్ణయం మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ తీవ్ర చర్చకు దారితీయడం ఖాయం. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే దారుణ ఓటమికి ఈ ఉద్యమం కూడా ఓ కారణం. బేజేపీ మ్యానిఫెస్టోలో సమర్థ లోక్ పాల్ కోసం హామీ ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణలో ఒరగబెట్టింది ఏమీ లేదని హజారా విమర్శించారు.