Men Shoot Policemen: పోలీస్‌ను కొట్టి అరెస్టైన వ్యక్తులు..
గన్స్ లాక్కొని ముగ్గురు పోలీసులపై కాల్పులు;
పోలీస్‌ను కొట్టినందుకు అరెస్టైన వ్యక్తుల్లో ఇద్దరు గన్స్ లాక్కొని ముగ్గురు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో ఆ ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. (Men Shoot Policemen) ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఒక చిన్నారిని బస్సు ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. రోడ్డుపై ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ జామ్ నివారించేందుకు ప్రయత్నించగా స్థానికులు పోలీసులపై తిరగబడ్డారు. ఒక పోలీస్ అధికారిని కొందరు కొట్టారు. దీంతో మిగతా పోలీసులు అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, పోలీస్‌ను బహిరంగంగా కొట్టిన గుంపులోని ఐదుగురు వ్యక్తులను అనంతరం అరెస్ట్ చేశారు. వారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు పోలీసుల నుంచి గన్స్ లాక్కొని కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. వెంటనే అలెర్ట్ అయిన మిగతా పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తుల కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు కాల్పుల్లో గాయపడిన ఎస్‌ఐ సురేంద్ర, కానిస్టేబుళ్లు అంకిత్ సింగ్, మిథున్‌తో పాటు ఇద్దరు వ్యక్తులను ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. పోలీసులపై కాల్పులు జరిపిన ఆ ఇద్దరు వ్యక్తులపై అదనంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, పోలీస్‌ను కొట్టడం, కాల్పుల్లో గాయపడిన పోలీసులు, వ్యక్తులు ఆసుప్రతిలో అడ్మిట్ అయిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.