Arunachal Pradesh: అరుణాచల్ మళ్లీ బీజేపీదే, వరుసగా 3వసారి
46 స్థానాల్లో కమలం పార్టీ ఘన విజయం;
అరుణాచల్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అధికార బీజేపీ ఘన విజయం సాధించింది. ఆదివారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో మొత్తం 60 నియోజకవర్గాలకుగానూ 46 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. పోలింగ్‌కు ముందే 10 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవ ఎన్నికతో విజయం సాధించారు. ఎన్నికలు జరిగిన 50 నియోజకవర్గాల్లో 36 స్థానాల్లో కమలం పార్టీ గెలిచిందని కౌంటింగ్ తర్వాత ఈసీ వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా కేవలం ఒక్క స్థానానికి పరిమితమైంది. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ)-5, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)-3, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్(పీపీఏ)-2 స్థానాల చొప్పున గెలుచుకోగా, స్వతంత్రులు మూడు చోట్ల విజయం సాధించారు. దీంతో రాష్ట్ర అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీతో బీజేపీ మూడోసారి అధికారం చేపట్టనున్నది. తాజా అసెంబ్లీ ఫలితాల నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా గవర్నర్ కేటీ పర్నాయక్ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేశారు. సీఎం పెమాఖండూ, మంత్రివర్గం రాజీనామాను ఆయన ఆమోదించారు.
బీజేపీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించినప్పటికీ, ఆ పార్టీ లోని కొందరు ప్రముఖ నేతలు ఎన్నికల్లో ఓడిపోయారు. యఛులి నియోజకవర్గంలో విద్యా శాఖ మంత్రి తబ తేదిర్ ఎన్సీపీ(అజిత్ పవార్) అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. మరో ప్రముఖ నేత, సీఎం పెమాఖండూకు సన్నిహితుడిగా భావించే న్యామర్ కర్బాక్ లిరోమోబా స్థానం నుంచి పరాజయం పాలయ్యారు. మూడుసార్లు ఎమ్మెల్యే కుంసి, రెండుసార్లు ఎమ్మెల్యే కైలింగ్ మొయోంగ్ కూడా ఈసారి ఓటమి చవిచూశారు. మరోవైపు పెమా ఖండూతో వ్యక్తిగత శత్రుత్వం ఉండే మాజీ హోంమంత్రి కుమార్ వాయ్ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఒకే ఒక్క అభ్యర్థిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. 2019లో ఓడిన ఎన్‌పీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిన తాంగ్‌వాంగ్ వాంగమ్ ఈసారి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు.
రాష్ట్రంలో ఏకగ్రీవమైన 10 మంది బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో సీఎం పెమా ఖండూ కూడా ఉన్నారు. ఈయనే రాష్ట్ర సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. క్రీడా ప్రేమికుడు, సంగీత ప్రియుడు అయిన పెమాఖండూ 2016లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు దారి తీసిన రాజ్యాంగ సంక్షోభం తర్వాత కీలక నేతగా ఎదిగారు. తన వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలతో ఈశాన్య రాష్ట్రంలో బీజేపీని తొలిసారిగా అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ నుంచి పీపీఏలో చేరిన ఆయన.. ఆ తర్వాత 2016లో మెజార్టీ పీపీఏ ఎమ్మెల్యేలతో బీజేపీ తీర్థం పుచ్చుకొని, సీఎంగా కొనసాగారు.
అరుణాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. బీజేపీపై విశ్వాసం ఉంచినందుకు ఆయన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. మరోవైపు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మూడు స్థానాల్లో జయకేతనం ఎగురవేయడంపై ఆ పార్టీ నేత ప్రఫుల్ పటేల్ హర్షం వ్యక్తం చేశారు.