Kejriwal : ప్రభుత్వాలను కూలదోయడంలో వారు సీరియల్‌ కిల్లర్లు : అరవింద్ కేజ్రీవాల్

Kejriwal : బీజేపీ, ఆప్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.;

Update: 2022-08-27 01:26 GMT

Kejriwal : బీజేపీ, ఆప్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గుజరాత్‌ ఎన్నికల్లో భయంతోనే ఈడీ, సీబీఐలను కేంద్రం ఉసిగొల్పుతోందని ఆరోపించారు. దాని ఫలితమే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియా, ఇతర మంత్రుల ఇళ్లలో సోదాలని అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అయ్యింది. అసెంబ్లీలో కేంద్రంపై కేజ్రీవాల్‌ నిప్పులు చెరిగారు. ఆప్‌ను ఏ ఒక్కరూ వీడలేదని చెప్పేందుకు అసెంబ్లీలో బల నిరూపణ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ కాస్తా ఆపరేషన్ కీచడ్ గా మారనుందని అన్నారు.

ఢిల్లీ ఆప్‌ సర్కార్‌ను కూలదోయటమే బీజేపీ ముందున్న ప్రధాన లక్ష్యమన్న కేజ్రీవాల్... ఇప్పటికే మణిపూర్‌, గోవా, మధ్యప్రదేశ్‌, బిహార్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలను కూలదోశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాలను కూలదోయడంలో వారు సీరియల్‌ కిల్లర్లు'' అంటూ బీజేపీపై మండిపడ్డారు. ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటూ ఉంటే.. వీరు ప్రభుత్వాలను కూలుస్తున్నారంటూ విమర్శించారు.

ఇటీవల కొన్నేళ్ల వ్యవధిలోనే బీజేపీ 277 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఆరోపించిన కేజ్రీవాల్...ఇందుకుగాను 5వేల 500 కోట్లు వెచ్చించిందన్నారు. ఒక్క ఢిల్లీలో ఆపరేషన్‌ కమలం చేపట్టేందుకు 800 కోట్లు కేటాయించారని విమర్శలు చేశారు. ఈ మొత్తమంతా జీఎస్టీ, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడం ద్వారా సమకూరినవేనని అన్నారు. అయితే సోమవారం దిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News