ముఖ్యమంత్రి పదవికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసిన కేజ్రీవాల్ తన రాజీనామా లేఖను అందజేశారు. ఆయనతో పాటు ఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆతిషి, ఇతర మంత్రులు సైతం గవర్నర్ ను కలిశారు. కేజ్రీవాల్ రాజీనామాను ఎల్జీ ఆమోదించిన అనంతరం త్వరలోనే ఆతిషి కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.కాగా, ఢిల్లీ మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై సీఎం కేజ్రీవాల్ అరెస్టయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దేశ అత్యున్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి కేజ్రీవాల్ విడుదలయ్యారు. సీఎం పదవికి రాజీనామా చేస్తానని ఆదివారం కేజ్రీవాల్ ప్రకటించారు. ఇందులో భాగంగా మంగళవారం తన రాజీనామాను ఎల్జీకి అందజేశారు. ఢిల్లీ ప్రజలు తనకు నిజాయతీపరుడని సర్టిఫికెట్ ఇచ్చే వరకు ఆ పదవిని చేపట్టబోనని కేజ్రీవాల్ పేర్కొన్నారు.