Arvind Kejriwal: అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు ఆస్కారం లేదు.. ఒంటరిగానే : కేజ్రీవాల్‌

ఎన్నికల్లో సొంత బలంతోనే పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్..;

Update: 2024-12-11 06:15 GMT

వచ్చే ఏడాది ఆరంభంలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి పార్టీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల మధ్య పొత్తు చర్చలు కొనసాగుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో కాంగ్రెస్‌కు 15 స్థానాలు, ఇండియా బ్లాక్ లోని మిగతా పార్టీలకు 1-2 స్థానాలను ఆప్ కేటాయించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని కేజ్రీవాల్ తోసిపుచ్చారు. రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ సొంత బలంతోనే ముందుకు వెళ్లనుందని ఆప్ చీఫ్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.

ఇక, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తోందని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన అభ్యర్థులతో కూడిన రెండు జాబితాను రిలీజ్ చేశారు. రెండు విడతల్లో 31 మంది అభ్యర్థుల పేర్లను ఇప్పటికే ఆప్ ప్రకటించింది. ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని.. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కేజ్రీవాల్.. ప్రజలు మళ్లీ తనకు విశ్వసనీయత సర్టిఫికెట్‌ ఇచ్చే వరకూ ముఖ్యమంత్రి పదవిలో ఉండబోనని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి, రాబోయే ఎన్నికల కోసం పార్టీని ముందుకు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆప్‌ సీనియర్ నేత ఆతిషి ఢిల్లీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

అయితే, ఈ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి బంగ్లా వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. తనను తాను సామాన్యుడిగా చెప్పే కేజ్రీవాల్‌.. అధికారంలో ఉన్నప్పుడు.. రూ.కోట్లు ఖర్చు పెట్టి సీఎం నివాసానికి మార్పులు చేశారని బీజేపీ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తోంది. ప్రజాధనం ఉపయోగించి కేజ్రీవాల్‌ ఇంధ్ర భవనాన్ని కట్టుకున్నారని మండిపడింది. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. విద్య, ఆరోగ్య సంస్కరణల గురించి ప్రజలు అడుగుతే.. బీజేపీ మాత్రం బంగ్లాల గురించి మాట్లాడుతుందని ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News