Karnataka Cop : సీఎం అవమానించారు, స్వచ్ఛంద పదవీ విరమణ కోరిన పోలీస్ ఆఫీసర్

జూన్‌ 12న ప్రభుత్వానికి లేఖ;

Update: 2025-07-04 03:45 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈమధ్య కాలంలో అనేక వివాదాల పాలవుతున్నారు. తెలిసో, తెలియకనో చేసే చిన్న చిన్న తప్పులతో అనేక గొడవల్లో ఇరుక్కుంటున్నారు. ఇటీవలే బహిరంగ సభలోనే ఓ పోలీసు అధికారిణి స్టేజీపైకి పిలిచి మరీ చెంప పగులగొట్టేందుకు చెయ్యి ఎత్తారు. ఈ ఘటన జరిగిన మూడు నెలలు కావొస్తుండగా.. అప్పట్లో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. అయితే తాజాగా సదరు పోలీస్ అధికారి ముఖ్యమంత్రి తనను అవమానించినందకు గాను స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సీఎం నన్ను తీవ్రంగా అవమానించారు, వెంటనే నా స్వచ్ఛంద పదవీ విరమణను అంగీరించమంటూ ఆయన డిమాండ్ చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 28వ తేదీన కర్ణాటకలోని బెలగావిలో జరిగిన ఓ ర్యాలీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా వెళ్లారు. అయితే అప్పటికే ఈయన పహల్గాం ఉగ్రదాడిపై షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్లపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే ర్యాలీకి వెళ్లగా.. సీఎంను చూసిన బీజేపీ నాయకులు.. గో టు పాకిస్థాన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన సీఎం.. అక్కడ ఏర్పాట్లు చూసుకుంటున్న అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) నారాయణ్ బరమణి స్టేజీపైకి పిలిచారు.

అంతా చూస్తుండగానే.. ఆయన చెంప పగులగొట్టేందుకు చెయ్యి లేపారు. అప్పట్లో ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవగా.. అంతా షాక్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపింది. ముఖ్యమంత్రి పదవిలో ఉండి.. ఓ పోలీసు అధికారిపైకి చెయ్యెత్తడాన్ని అందరూ తప్పుబట్టారు. అయితే ఇదంతా జరిగి రెండు నెలలు పూర్తయ్యే సమయంలో.. సదరు పోలీస్ అధికారి అవమాన భారాన్ని తట్టుకోలేకపోతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా జూన్ 12న ఏఎస్పీ బరమణి తన స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తన లేఖలో.. తాను "తీవ్రంగా అవమానానికి గురయ్యానని" ఈ ఘటన వల్ల "తీవ్ర మానసిక క్షోభను" అనుభవించానని పేర్కొన్నారు.

జాతీయ, సామాజిక మాధ్యమాలలో ఈ విషయం విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో తన పరువుకు భంగం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వెంటనే తన స్వచ్ఛంద పదవీ విరమణను అంగీకరించాలని కోరారు. అయితే తాజాగా దీనిపై బీజేపీ స్పందించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీరును తీవ్రంగా ఖండించింది. సీఎం అహంకారానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనమని బీజేపీ నాయకులు విమర్శించారు. సిద్ధరామయ్య వెంటనే బరమణికి, పోలీసు విభాగానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీతో పాటు జనాతా దళ్ (సెక్యులర్) కూడా ముఖ్యమంత్రి ప్రవర్తనను అత్యంత సిగ్గుచేటు, అగౌరవ ప్రదర్శనగా అభివర్ణించింది. బరమణి తన VRS నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని కూడా బీజేపీ కోరింది.

Tags:    

Similar News