Woman Murder Husband: భర్తను చంపి ఇంట్లోనే పూడ్చి పెట్టి

ఇరుగుపొరుగు వారి అనుమానంతో బయటపడిన ఘటన..;

Update: 2025-07-15 04:00 GMT

ఒక మహిళ తన భర్తను హత్య చేసింది. ఐదు అడుగుల గొయ్యి తవ్వి అందులో పాతిపెట్టింది. తన భర్త పని కోసం కేరళ వెళ్లినట్లు స్థానికులకు చెప్పింది. అయితే ఆమెపై అనుమానం రావడంతో ఇంటి నుంచి పారిపోయింది. అస్సాం రాజధాని గౌహతిలో ఈ సంఘటన జరిగింది. 38 ఏళ్ల రహీమా ఖాతున్, 38 ఏళ్ల సబియాల్ రెహ్మాన్‌కు 15 ఏళ్ల కిందట వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. గౌహతిలోని పాండు ప్రాంతంలోని జోయ్‌మతి నగర్‌లో వారు నివసిస్తున్నారు.

కాగా, జూన్‌ 26న రాత్రి వేళ భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న భర్త సబియాల్ రెహ్మాన్‌ను, భార్య రహీమా ఖాతున్‌ కొట్టి చంపింది. ఆ తర్వాత ఇంటి ప్రాంగణంలో తవ్విన ఐదు అడుగుల లోతైన గోతిలో భర్త మృతదేహాన్ని పాతిపెట్టింది. తన భర్త పని కోసం కేరళ వెళ్లినట్లు అందరికి చెప్పింది. అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో హాస్పిటల్‌కు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి పారిపోయింది.

మరోవైపు సబియాల్ రెహ్మాన్‌ అదృశ్యంపై అతడి సోదరుడు ఆందోళన చెందాడు. రహీమా ఖాతున్‌పై అతడు అనుమానించాడు. ఈ నేపథ్యంలో జూలై 12న పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె జూలై 13న ఆ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయింది. కుటుంబ కలహాల వల్ల జరిగిన గొడవలో తామిద్దరం కొట్టుకున్నట్లు తెలిపింది. తీవ్రంగా గాయపడిన భర్త చనిపోయినట్లు చెప్పింది. భయపడిన తాను ఇంటి ఆరవణలో గొయ్యి తవ్వి భర్త మృతదేహాన్ని పాతిపెట్టినట్లు వివరించింది.

కాగా, సబియాల్ రెహ్మాన్‌ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ మహిళ ఒక్కతే ఐదు అడుగుల గొయ్యి తవ్వి భర్త మృతదేహాన్ని పాతిపెట్టడంపై పోలీసులు అనుమానించారు. ఆమెకు ఇతర వ్యక్తులు సహకరించి ఉంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ హత్య కేసుపై మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు.

Tags:    

Similar News