Shubhanshu Shukla: భారత్ కు బయలుదేరిన వ్యోమగామి శుభాన్షు శుక్లా..
ప్రధాని మోడీని కలిసే అవకాశం;
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా స్వదేశానికి పయనమయ్యారు. అంతరిక్ష యాత్ర తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న ఆయన, రేపు (ఆదివారం) ఇక్కడ అడుగుపెట్టనున్నారు. అనంతరం సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
భారత్‌కు బయల్దేరిన విషయాన్ని శుభాన్షు శుక్లా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. విమానంలో చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను పోస్ట్ చేస్తూ, తన కుటుంబ సభ్యులు, స్నేహితులను కలుసుకోవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆగస్టు 23న జరగనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో కూడా ఆయన పాల్గొంటారని సమాచారం.
ఈ ఏడాది జూన్‌లో యాక్సియం-4 మిషన్‌లో భాగంగా శుభాన్షు బృందం అంతరిక్షంలోకి వెళ్లింది. ఈ మిషన్‌కు చీఫ్ పైలట్‌గా వ్యవహరించిన ఆయన, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజుల పాటు ఉన్నారు. ఈ సమయంలో 60కి పైగా కీలకమైన శాస్త్రీయ ప్రయోగాలలో పాలుపంచుకుని, జులై 15న సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు.
ఈ యాత్రతో శుభాన్షు శుక్లా అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. 1984లో రాకేశ్ శర్మ సోవియట్ యూనియన్ మిషన్‌లో భాగంగా రోదసిలోకి వెళ్లారు. అంతేకాకుండా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా కూడా శుభాన్షు నిలవడం విశేషం.