ATM Withdraw: మే నుంచి ఏటీఎం చార్జీల మోత
క్యాష్ విత్‌డ్రాయల్ ఫీజును రూ.17 నుంచి రూ. 19 కి పెంపు
ఏటీఎంలో నగదు ఉపసంహరణ, బ్యాలన్స్ చెక్ లావాదేవీలపై చార్జీలు మే 1 నుంచి పెరుగుతాయి. ఖాతా ఉన్న హోం బ్యాంక్ నెట్‌వర్క్ ఏటీఎం నుంచి కాకుండా ఇతర బ్యాంక్ నెట్‌వర్క్‌లోని ఏటీఎం నుంచి లావాదేవీలను జరిపే వారిపై ఈ భారం పడుతుంది. ఇతర బ్యాంకుల ఏటీఎంల ద్వారా మెట్రో నగరాల్లో నెలకు 5 లావాదేవీలు, నాన్ మెట్రో ప్రాంతాల్లో నెలకు మూడు లావాదేవీలు ఉచితంగా జరుపుకోవచ్చు.
ఈ పరిమితి దాటిన తర్వాత జరిపే ప్రతి లావాదేవీపైనా అదనపు భారం పడుతుంది. నగదు ఉపసంహరణ రుసుము ప్రతి లావాదేవీకి రూ.17 నుంచి రూ.19కి పెరుగుతుంది. బ్యాలన్స్ ఎంక్వైరీ ఫీజు ప్రతి లావాదేవీకి రూ.6 నుంచి రూ.7కు పెరుగుతుంది. నిర్వహణ వ్యయాలు పెరుగుతున్నందు వల్ల ఈ రుసుములను పెంచాలని వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు చాలా కాలం నుంచి కోరుతున్నారు.
వైట్-లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు తమ నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు పెంచాలని కోరారు. ఈ ప్రతిపాదనను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆమోదించగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కూడా ఆమోదం తెలిపింది. దీంతో కొత్త చార్జీలు మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
వీటి ప్రభావం చిన్న బ్యాంకులపై పడనుంది. ఆ బ్యాంకులకు తక్కువ ఏటీఎంలు ఉండటంతో, వాటి ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో వారు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. అలాగే తరచుగా ఏటీఎం వినియోగించే వారు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇలా నగదు లావాదేవీలకు చెల్లించే ఛార్జీలు పెరగడంతో ప్రజలు డిజిటల్ లావాదేవీల వైపు మరింతగా మొగ్గు చూపే అవకాశముంది.