Atul Subhash Case: బెంగళూరు టెకీ కేసులో కీలక పరిణామం..
అతుల్ భార్య, అత్త అరెస్ట్, జ్యుడీషియల్ కస్టడీకి తరలించనున్న పోలీసులు;
భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అతుల్ సుభాష్ భార్య నిఖితా సింఘానియా, అత్త నిషా, బావమరిది అనురాగ్‌ను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. అతుల్ భార్య నిఖితాను హరియాణాలోని గురుగ్రామ్‌లో అరెస్టు చేయగా.. అత్త, బావమరిదిని ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచి. జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
భార్య వేధింపుల కారణంగా బెంగళూరుకు చెందిన టెకీ అతుల్ సుభాష్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అతను రాసిన 24 పేజీల సుదీర్ఘమైన లేఖ, 80 నిమిషాల వీడియో అందర్నీ కదిలించింది. సూసైడ్ నోట్‌లో తన భార్యతో కొనసాగుతున్న వైవాహిక బంధ వివాదం గురించి పేర్కొన్నాడు. భరణం కోసం తమ నాలుగేండ్ల కొడుకును తన భార్య తనపైకి అస్త్రంగా ప్రయోగించిందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ కుటుంబ న్యాయస్థానంలో తనపై తన భార్య కుటుంబం పెట్టిన కేసుల్లో హత్య, అసహజ శృంగారం, భరణం కోసం నెలకు రూ.2 లక్షల డిమాండ్ ప్రధానమైనవని వెల్లడించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, టెకీ ఆత్మహత్య నేపథ్యంలో ‘మెన్‌టూ’ అన్నది ఎక్స్‌లో ట్రెండింగ్‌గా మారింది. చట్టాలన్నీ మహిళలకు అనుకూలంగానే ఉన్నాయని నెటిజన్లు పోస్టులు పెట్టారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు ఉన్న ఐపీసీ సెక్షన్ 498ఏను దుర్వినియోగం చేయడంపై న్యాయస్థానాలు సైతం ఆందోళనలు వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అతుల్ భార్య, కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నారు.