PM Modi: పహల్గామ్ ఉగ్ర దాడిపై మరోసారి ప్రధాని మోడీ సీరియస్ కామెంట్స్
మహిళల సిందూరాన్ని తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశామన్న ప్రధాని;
మన మహిళల సిందూరాన్ని తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశామని ప్రధాని మోడీ అన్నారు. మోడీ రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బికనీర్‌లో ఏర్పాటు చేసిన సభలో పహల్గామ్ గురించి మాట్లాడుతూ.. పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదులను అంతం చేశామని తెలిపారు. కేంద్రం త్రివిధ దళాలకు పూర్తి స్వచ్ఛ ఇచ్చిందని గుర్తుచేశారు. మన దళాలు చక్ర వ్యూహాలు పన్ని శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేశాయని తెలిపారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడికి జవాబుగా 22 నిమిషాల్లోనే ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు చెప్పారు. భారత్‌లో రక్తపుటేర్లు పారించిన వాళ్లను ముక్కలు.. ముక్కలు చేసినట్లు మోడీ పేర్కొన్నారు.
మే 7న చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా మరియు హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద గ్రూపులతో అనుబంధంగా ఉన్న దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటానికి భారతదేశం ఐక్యంగా ఉందని చెప్పారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి 140 కోట్ల మంది భారతీయులను కదిలించిందన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదుల గుండెపై దాడి చేశామన్నారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ నివ్వడంతోనే ఇదంతా జరిగిందని మోడీ చెప్పుకొచ్చారు.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు.. అమాయకులను లక్ష్యంగా చేసుకున్నారని.. మతం ఆధారంగా వేరు చేసి.. మహిళల నుదిటిపై ఉన్న సిందూరాన్ని తుడిచేశారని.. దానికి ప్రతీకారంగానే మన దళాలు వాళ్లను మట్టిలో పాతిపెట్టేశారన్నారు. 140 కోట్ల మంది భారతీయుల హృదయాలను గాయపరిచారు.. అందుకే వాళ్లను ముక్కలు.. ముక్కలు చేశామని వెల్లడించారు. కేవలం 22 నిమిషాల్లోనే ఉగ్రవాదుల శిబిరాలు నాశనం అయినట్లు చెప్పారు. త్రివిధ దళాల దెబ్బకు పాకిస్థాన్ వెనక్కి తగ్గిందని తెలిపారు. ఇక అణు బాంబుల భయానికి భారతదేశం వెనుకాడదని మరోసారి మోడీ స్పష్టం చేశారు.
ఇక అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ స్టేషన్లను రాజస్థాన్ నుంచి వర్చువల్‌గా మోడీ ప్రారంభించారు. కొత్త స్టేషన్లను జాతికి అంకితమిచ్చారు. ఇందులో తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఏపీలోని సూళ్లూరుపేట అమృత్ భారత్ స్టేషన్‌ను కూడా ప్రారంభించారు.యూపీలో 19, గుజరాత్‌లో 18, మహారాష్ట్రలో 15, రాజస్థాన్‌లో 8 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించారు.