ఉత్తరప్రదేశ్ అయోధ్యలో రామమందిరంలో ప్రతిష్ఠించిన బాలరాముడి ఫొటోతో పోస్టల్ స్టాంపు వచ్చింది. ప్రపంచంలోనే తొలిసారిగా లావో పీపుల్స్ డెమొక్రాటిక్ రిపబ్లిక్ (లావో పీడీఆర్) అనే దేశం ఈ స్టాంప్ రిలీజ్ చేసింది. లావోస్ రాజధాని వియంటియాన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, లావో పీడీఆర్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి సలెమ్క్ కొమ్మసిత్ సంయుక్తంగా శ్రీ రామ్ లల్లా ప్రత్యేక తపాలా స్టాంపును ఆవిష్కరించారు.
భారతదేశం, లావో పీడీఆర్ మధ్య లోతైన నాగరికత, సాంస్కృతిక సంబంధాలకు ఇది నిదర్శనమని కేంద్ర మంత్రి జైశంకర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. లావోస్ లోని భారత రాయబారి ప్రశాంత్ అగర్వాల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు ప్రత్యేకమైన స్టాంపులను విడుదల చేశారు. ఒకదానిపై ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన లుయాంగ్ ప్రబాంగ్ లార్డ్ బుద్ధుడిని.. రెండో దానిపై అయోధ్య శ్రీ రామ్ లల్లా విగ్రహాన్ని ముద్రించారు.