Ayodhya: అయోధ్యలో 26 లక్షల దీపాలు.. రెండు గిన్నీస్‌ రికార్డులు

సంప్రదాయ మట్టి ప్రమిదలలో 26,17,215 నూనె దీపాల ఏర్పాటు

Update: 2025-10-20 00:15 GMT

రామనగరిలో వెలుగుల వేడుక సంబరాలు అంబరాన్ని అంటాయి. అయోధ్య దీపోత్సవానికి ఏకంగా రెండు గిన్నీస్ రికార్డులు సొంతం అయ్యాయి. అయోధ్య నగరంలో 9వ దీపోత్సవంలో భాగంగా ఈ ఏడాది 26 లక్షలకుపైగా దీపాలను వెలిగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సరయూ నదీ తీరం వెంబడి లక్షలాది దీపాలను వెలిగించారు.

నదీ తీరంలోని ఘాట్‌లు పెద్దఎత్తున భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రామ్‌లీలా వంటి సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్‌ షో ఆకట్టుకున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అయోధ్య రామమందిరంలో పూజలు నిర్వహించి, రామ్‌ కీ పైడీ ఘాట్‌లో హారతి ఇచ్చారు. అనంతరం ఆయన రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వేషధారణలోని కళాకారులు ఆశీనులైన రథాన్ని లాగారు. ఈ సందర్భంగా ఆయన దీపాన్ని వెలిగించి.. వేడుకలను ప్రారంభించారు. దీపోత్సవం నేపథ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

తాజాగా అయోధ్య నగరంలో నిర్వహించిన దీపోత్సవం కార్యక్రమాన్ని 2017లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఇప్పుడు జరిగింది దీపోత్సవ్ తొమ్మిదవ ఎడిషన్. మొదటి ఎడిషన్‌లో 1.71 లక్షల దీపాలు వెలిగించగా, ఈసారి ఆ సంఖ్య 2.6 మిలియన్లు దాటింది. రామ్ కీ పైడితో సహా సరయు నది వెంబడి ఉన్న 56 ఘాట్‌లన్నీ దివ్యల వెలుగులు సంతరించుకున్నాయి. ఇన్ని దీపాలు ఒక దగ్గర కనిపించడంతో నక్షత్రాలు ఆకాశం నుంచి భూమికి దిగివచ్చినట్లుగా చూపరులను ఆకట్టుకుంది.

అయోధ్య దీపోత్సవంలో రెండు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. మొదటిది 26,70,215 దీపాలను వెలిగించడం, రెండవది 2128 మంది పూజారులు సరయు తల్లికి ఏకకాలంలో మహా ఆరతి నిర్వహించడం. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అందుకున్నారు.

Tags:    

Similar News