Ayodhya's Ram Temple: చరిత్ర సృష్టించిన అయోధ్య రాముడు..

60 లక్షల మంది దర్శనం .. రూ.25 కోట్లు విరాళాలు

Update: 2024-02-25 02:45 GMT

అయోధ్య బాలక్ రామ్ ను  నెల రోజుల్లో సుమారు 60 లక్షల మంది భక్తులు దర్శించారు.  అలాగే రామ్ లల్ల ప్రాణ ప్రతిష్ఠ తరువాత రాములవారి ఆలయానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. జనవరి 22న రాములోరి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన విషయం తెలిసిందే. నెల రోజులపాటు ఆలయానికి సమకూరిన విరాళాల వివరాలను ఆలయ ట్రస్ట్ అధికారులు శనివారం వెల్లడించారు. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 22 వరకు ఆలయానికి బంగారం, వెండి, చెక్కులు తదితర రూపాల్లో సమకూరిన ఆదాయం విలువెంతో తెలుసా.. అక్షరాలా రూ.25 కోట్లు. ట్రస్ట్ కార్యాలయ ఇన్‌ఛార్జ్ ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ.. వివిధ రూపంలో వచ్చిన రూ.25 కోట్ల విరాళాలు హుండీల్లో జమ అయినట్లు తెలిపారు.

అయితే ఆన్ లైన్ చెల్లింపుల గురించి తమకు తెలియదని అన్నారు. జనవరి 23 నుంచి ఇప్పటి వరకు 60 లక్షల మంది భక్తులు రామ్‌లల్లా దర్శనం చేసుకున్నారని చెప్పారు. అయోధ్యలో సుమారు 50 లక్షల మంది భక్తులు హాజరయ్యే శ్రీ రామ నవమి పండుగ రోజుల్లో విరాళాలు మరింతగా పెరుగుతాయని ఆలయ ట్రస్ట్ భావిస్తోంది.  రసీదుల జారీకి కంప్యూటరైజ్డ్ కౌంటర్లతోపాటు ఆలయ ప్రాంగణంలో అదనపు హుండీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. భారీ మొత్తంలో అందే నగదు విరాళాల లెక్కింపు కోసం నాలుగు ఆటోమేటిక్ హైటెక్ కౌంటింగ్ మెషీన్లను ఎస్‌బీఐ ఏర్పాటు చేసిందని చెప్పారు. పెద్ద మొత్తంలో నగదు లెక్కింపు కోసం ఒక ప్రత్యేక గదిని త్వరలో నిర్మించనున్నట్లు వెల్లడించారు. అలాగే భక్తులు సమర్పించిన బంగారు, వెండి ఆభరణాల నిర్వహణ, కరిగించడం వంటివి భారత ప్రభుత్వ మింట్‌కు అప్పగించినట్లు వివరించారు.

అయోధ్య రామ మందిరాన్నిమరి కొన్ని రోజులపాటూ  రోజూ గంటపాటు మూసివేయనున్నారు. జనవరి 22న జరిగిన ప్రతిష్ఠా కార్యక్రమం అనంతరం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఆలయ ట్రస్ట్ దర్శన సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలకు పెంచింది. ప్రతిష్ఠా కార్యక్రమానికి ముందు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శన సమయం, మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 గంటల వరకు రెండు గంటల విరామం ఉంటుంది.

Tags:    

Similar News