Akshay Shinde: బద్లాపూర్ రేపిస్ట్ ఎన్‌కౌంటర్
పోలీసులపైకి కాల్పులు జరిపి, ఎదురుకాల్పుల్లో మృతి;
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బద్లాపూర్ లైంగికదాడుల కేసులో నిందితుడు పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్ స్కూల్‌లో ఇటీవల ఇద్దరు నాలుగేండ్ల విద్యార్థినులపై లైంగికదాడులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న నిందితుడు షిండే సోమవారం సాయంత్రం పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు.
జైలు నుంచి తరలిస్తున్న సమయంలో అతడు ఓ పోలీసు వద్దనున్న తుపాకీ గుంజుకొని కాల్పులు జరిపాడని, తాము జరిపిన ఎదురు కాల్పులు జరుపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడని అధికారులు తెలిపారు. ఓ సీనియర్ పోలీస్ అధికారి కథనం ప్రకారం.. లైంగిక దాడుల కేసులో జైలులో ఉన్న నిందితుడు షిండేపై గతవారం అతడి రెండో భార్య బోయిసర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఈ కేసులో ప్రశ్నించేందుకు నిందితుడిని పోలీసులు సోమవారం సాయంత్రం 5.30 గంటలకు తలోజా జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పది మంది పోలీసుల బందోబస్తు మధ్య స్టేషన్‌కు తరలిస్తుండగా వాహనం ముంబ్రా బైపాస్ వద్దకు చేరుకోగానే తన పక్కనే కూర్చున్న ఏఎస్‌ఐ వద్దనుంచి నిందితుడు తుపాకీ లాక్కొని కాల్పులు జరిపాడు. దీంతో ఏఎస్‌ఐ కాలులోకి బుల్లెట్లు దిగాయి. ఆ పక్కనే కూర్చన్న మరో అధికారి వెంటనే స్పందించి నిందితుడిపై మూడురౌండ్లు కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన షిండేను ఛత్రపతి శివాజీ మహరాజ్ దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు’ అని వివరించారు.