Bareilly violence: యూపీ బరేలీ అల్లర్లలో కుట్ర కోణం..

ఐలవ్ ముహమ్మద్ వివాదంలో కీలక విషయాలు..

Update: 2025-10-02 00:55 GMT

ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా ఇటీవల ‘‘ఐ లవ్ ముహమ్మద్’’ వివాదం నెలకొంది. సెప్టెంబర్ 26న బరేలీలో దీనిపై ఆకస్మికంగా గుమిగూడిన ప్రజలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లకు ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఇత్తెహాద్ ఎ మిల్లత్ కౌన్సిల్(IMC) చీఫ్ తౌకీర్ రజాను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి సన్నిహితులు, అనుచరులపై యోగి సర్కార్ బుల్డోజర్ యాక్షన్ ప్రారంభించింది.

అయితే, అల్లర్లకు ముందు రోజే పథకం ప్రకారం అశాంతిని సృష్టించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిజానికి ఐఎంసీ శాంతియుత నిరసనకు పిలుపునిచ్చినప్పటికీ, పార్టీ క్యాడర్ నుంచి మాత్రం వచ్చిన సందేశం అశాంతి దారి తీసినట్లు తెలుస్తోంది. ముందుగా ఇత్తెహాద్-ఏ-మిల్లత్ కౌన్సిల్ (IMC) సెప్టెంబరు 25న ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో సెప్టెంబరు 26న ఇస్లామియా ఇంటర్ కాలేజ్‌లో ఏ కార్యక్రమానికీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, అందువల్ల ప్రజలు మసీదుల్లో ప్రార్థనలు ముగించిన వెంటనే ఇంటికి వెళ్లిపోవాలంటూ స్పష్టం చేశారు. దీనిని గమనించిన పోలీసులు శాంతియుత పిలుపుగా భావించి పెద్దగా భద్రతా ఆందోళనల్ని వ్యక్తం చేయలేదు.

అయితే, ఆదివారం తెల్లవారుజాము తౌకీర్ రజా అనుచరుడు, ఐఎంసీ మెంబర్ నదీమ్ ఖాన్ అదే లేఖను వాట్సాప్ గ్రూప్ లో పంపాడు. అయితే, ఈ లేఖ ఫేక్ అని, కౌన్సిల్ పేరు దెబ్బతీయాలని చూస్తున్నారని చెబుతూ ప్రజల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించాడు. ఇదే మొత్తం అల్లర్లకు ముఖ్య కారణమని పోలసీులు భావిస్తున్నారు. ఈ మెసేజ్ కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున గుంపులుగా సమావేశమయ్యారు. అదే రోజు అల్లర్లు జరిగాయి. దీనికి ముందు సెప్టెంబర్ 21న తౌకీర్ రాజ ఓ వీడియోను విడుదల చేస్తూ.. వెళ్లి ప్రదర్శన చేయండి, అవసరమైతే హింసకు వెనకాడొద్దని పిలుపునిచ్చినట్లు ఎఫ్ఐఆర్ పేర్కొంది. పోలీసులపై ఆయుధాలు, పెట్రోల్ బాంబులు విసిరారు. అనేక మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఇప్పటి వరకు ఈ అల్లర్లపై 11 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 80 మందిని అరెస్ట్ చేశారు. 2000 మందికి పైగా నిందితులు ఉన్నారు. అల్లర్లకు పాల్పడిన వారి ఆస్తుల్ని యోగి సర్కార్ సీజ్ చేస్తోంది.

Tags:    

Similar News