తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా తీరంలో భారీ తిమింగలం ఒడ్డుకు కొట్టుకురావడం స్థానికంగా సంచలనం రేపింది. మత్స్యకారుల వల్లో చిక్కుకున్న ఈ తిమింగలం సుమారు 10 అడుగుల పొడవు, 2 టన్నుల బరువు కలిగి ఉన్నట్టు అధికారులు తెలిపారు. వలలో చిక్కుకున్న వెంటనే మత్స్యకారులు దానిని విడిపించేందుకు ప్రయత్నించినా, గాయాలు తీవ్రంగా ఉండటం, ఊపిరి ఆడకపోవడం వల్ల అది ప్రాణాలు కోల్పోయింది.
తిమింగలం మృతదేహం ఒడ్డుకు కొట్టుకురావడంతో చుట్టుపక్కల గ్రామాల నివాసులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అటవీ, పర్యావరణ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని తిమింగలం మరణానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
సాధారణంగా తిమింగలాలు లేదా ఇతర పెద్ద సముద్ర జీవులు ఒడ్డుకు కొట్టుకురావడానికి వలలో చిక్కుకోవడం, అనారోగ్యం, దిశ తప్పడం వంటి అనేక కారణాలు ఉంటాయని అధికారలు వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు ఇటీవల ఒడిశాలో కూడా చోటుచేసుకున్నాయి. అక్కడ కూడా ఒక భారీ తిమింగలం కళేబరం తీరానికి కొట్టుకురావడం జరిగింది. అయితే ఈ భారీ తిమింగలాన్ని బయటకు తీసేందుకు అధికారులు తీవ్ర స్థాయిలో కష్టపడ్డారు.